వైసీపీ నేతలకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చింది. ఎలాగైనా సరే.. మనమే గెలుస్తామనే ధీమాతో లెక్కలేనన్ని తప్పులు చేశారు వైసీపీ నేతలు. ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నాటి బాధితులంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తప్పులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలపైన సోషల్ మీడియా బాధితులు కూడా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అరెస్టులు కూడా చేస్తున్నారు. దీంతో.. తమ వాళ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు తెగ గగ్గొలు పెడుతున్నారు.
Also Read : లిమిట్స్ లో ఉండు.. సజ్జలకు మాజీ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
వైసీపీ నేతలు, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారిని ఊరికే వదిలేది లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల బట్టలూడదీస్తామంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని.. ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే వైసీపీ నేతలను వేధించిన అధికారులు, పోలీసులు, నేతల పైన ఫిర్యాదు చేయాలంటూ ఓ డిజిటల్ బుక్ కూడా ఓపెన్ చేశారు జగన్.
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత.. పేరు, ఊరు, నియోజకవర్గం వివరాలు నమోదు చేసి.. ఆ తర్వాత తమను వేధించిన నేతలు, అధికారుల వివరాలను ఫోటోతో సహా నమోదు చేయాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ బుక్‌లో ఉన్న ప్రతి ఒక్కరిపైన కఠిన చర్యలుంటాయని కూడా జగన్ హెచ్చరించారు. అయితే ఇక్కడే వైసీపీ నేతలకు ఓ కొత్త సమస్య వచ్చి చేరింది. ఫిర్యాదు చేసే వారి సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ.. వీరిలో కొన్ని ఫిర్యాదులు వైసీపీకి తలనొప్పిగా మారాయి.
“వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము బాధితులం.. మాకు కూడా న్యాయం చేయండి..” అనే ఫిర్యాదులు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. వైసీపీ నేతలు తమపై ఎన్నో దౌర్జన్యాలు చేశారని.. తమ ఆస్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడదల రజినీ బాధితులు ఫోటోలతో సహా ఆమెపైన ఫిర్యాదు చేశారు. అలాగే మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి బాధితులు ఏకంగా వీడియోలు పోస్ట్ చేశారు.
Also Read : పాకిస్తాన్ పరువు తీసిన భారత హీరోలు..!
ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో.. ప్రతి ఒక్కరూ వైసీపీ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి మేము కూడా బాధితులమే జగనన్నా.. మాకు కూడా న్యాయం చేయండి అని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మా ఆస్తులు కూడా వైసీపీ నేతలు లాక్కున్నారు.. అడిగితే చంపుతామంటున్నారు.. అంటూ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. దీంతో.. రెడ్ బుక్ కౌంటర్‌గా డిజిటల్ బుక్ పెడితే.. దీనిలోకి మన వాళ్ల పేర్లే ఎక్కువగా ఎక్కుతున్నాయే.. అని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.