తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు తోడ్పడిన మరో ప్రధాన అంశం బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే సందేశం బలంగా గ్రామస్థాయి వరకు కూడా వెళ్లడం. దానితో ఆ రెండు పార్టీలు కూడా బాగా నష్టపోయాయి. ఇటువంటి ప్రచారం కారణంగానే తాము సృష్టించిన `బిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత’తో కాంగ్రెస్ ప్రయోజనం పొందినట్లు బిజెపి నాయకులు ఇప్పుడు వాపోతున్నారు.
ఇప్పుడు ఏపీలో సహితం బీజేపీ, వైఎస్ఆర్సీపీల మధ్య నెలకొన్న బంధం బహిరంగ రహస్యమే. అవినీతి కేసుల నుండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జగన్ కు `రక్షణ కవచం’గా ఉంటున్నట్లు సాధారణ ప్రజలు సహితం గ్రహించారు. అయితే, బిజెపికి నోటాకు ఉన్న ఓట్లు కూడా లేవని తెలిసి కూడా జగన్ ప్రభుత్వ దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ఆ పార్టీతో బంధం కోసం టిడిపి నేతలు తాపత్రయ పడుతున్నట్లు కూడా వెల్లడి అవుతుంది.
జనసేన ఒకవైపు తాను ఎన్డీయేలో భాగస్వామి అని చెప్పుకొంటూ, తెలంగాణాలో బిజెపితో పొత్తు పెట్టుకొని, ఏపీలో మాత్రం టిడిపితో పొత్తుకు సిద్దపడటం సాధారణ ప్రజలను గందరగోళంకు నెట్టివేస్తుంది. బీజేపీతో దోస్తీ ధృతరాష్ట్రుడి కౌగిలి అన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఎంత త్వరగా గ్రహిస్తే అంత వారికే మంచిది కాగలదు.
ముఖ్యంగా విభజన హామీలు నెరవేర్చని బీజేపీపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ ప్రభుత్వం పొలిసు కేసులతో వేధిస్తుంటే ప్రజాబలంతో ఎదిరించే ప్రయత్నం చేయాలి తప్ప అందుకోసం బిజెపి రక్షణకోసం వెంపర్లాడటం రాజకీయంగా టిడిపికి `ఆత్మహత్య సదృశ్యం’గా మారే ప్రమాదం ఉంది.
ఇప్పటికే నారా లోకేష్ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ ప్రజల ఓట్లు పొందటం కోసం బిజెపి వేసిన ఎత్తుగడలో పావుగా టిడిపి మారిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యానికి, ఓటమికి ప్రధానకారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే. సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఎన్నికల ముందు పలు సర్వేలు చెప్పినప్పటికీ బీఆర్ఎస్ ఒంటెత్తుపోకడలతో సిట్టుంగులకే సీట్లు ఇచ్చి చేతులు కాల్చుకుంది.
ఏపీలోనూ దాదాపు 40 శాతం మంది వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని క్షేత్రస్థాయిలోని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. వీరికి తోడు రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. వీరి పనితీరు, వ్యవహారశైలీ, అవినీతితో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి పెను సవాల్ కాబోతోంది.
ఈ ప్రమాదాన్ని గ్రహించిన వైఎస్ జగన్ దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తున్నది. అయితే టిడిపి సహితం ఇటువంటి ప్రమాదాలనే ఎదుర్కొంటున్నదని గ్రహించాలి. దశాబ్దాల తరబడి పార్టీ నాయకులుగా ఉన్నవారిలో `పోరాట స్వభావం’ సన్నగిల్లడం, తమ నియోజకవర్గాలలో కొత్త నాయకులను రానీయకుండా చేయడం జరుగుతున్నది.
వరుసగా ఓటమి చెందుతున్న నాయకులకు తిరిగి సీట్లు ఇస్తే టిడిపి ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. గత నాలుగేళ్లుగా కనిపించకుండా తమ వ్యాపారాలు చూసుకొంటూ, అకస్మాత్తుగా ఎన్నికల ముంది క్రియాశీలం అవుతున్న నాయకుల పట్ల కూడా జాగురకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త వారి పేరుతో నియోజకవర్గంతో సంబంధం లేకుండా డబ్బుల సంచులతో కనిపిస్తున్న నాయకులతో సహితం ముప్పు ఏర్పడగలదని గ్రహించాల్సి ఉంది.