వైసీపీ అంటే సజ్జల.. సజ్జల అంటే వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 2019 ఎన్నికల ముందు వరకు ఒక లెక్క.. ఆ తర్వాత నుంచి ఒక లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టిన జగన్.. అప్పటి వరకు ఎక్కడా కనిపించని సజ్జల రామకృష్ణారెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా కీలక పదవులిచ్చారు. సజ్జల లేకపోతే పార్టీ లేదు.. ప్రభుత్వంలో పనులు కూడా జరగవు అనేలా పరిస్థితి మారిపోయింది. చివరికి సజ్జలకు తెలియకుండా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో చీమ కూడా చిటుక్కుమనడానికి లేదు. ఇలాంటి సజ్జల వల్లే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఇక పార్టీ నుంచి బయటకు వచ్చిన మరికొందరు సీనియర్లు అయితే.. జగన్ చుట్టూ కోటరీ చేరిందంటూ పరోక్షంగా సజ్జలను ప్రస్తావించారు.
Also Read : స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో అనుపమ
ఈనాడులో పాత్రికేయ వృత్తి ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధం, అనుభవంతో వైసీపీలో నంబర్ టూ స్థాయికి ఎదిగారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు సజ్జల చెప్పింది వేదం.. చేసింది చట్టం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అది ఉద్యోగుల సమస్య అయినా సరే.. ప్రతిపక్షం చేసిన ఆరోపణలకు బదులు చెప్పాలన్నా సరే.. మంత్రివర్గ ఉప సంఘం భేటీ అవ్వాలన్నా సరే.. చివరికి పాత్రికేయ మిత్రుల సమస్యలైనా.. అందుకు సజ్జల నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే.. బంట్రోతు మొదలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు… కిందిస్థాయి కార్యకర్త మొదలు.. ఉప ముఖ్యమంత్రి స్థాయి నేత వరకు ఎవరైనా సరే.. సజ్జల కంట్రోల్‌లో ఉండాల్సిందే.. సజ్జల ఆదేశాలు పాటించాల్సిందే.
Also Read : మళ్ళీ మొదలైన టీ కాంగ్రెస్ మంత్రి పదవి రచ్చ
వైసీపీ ఐదేళ్ల పాలనలో సకల శాఖ మంత్రిగా సజ్జల పేరు. తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఇద్దరు మహిళా పాత్రికేయుల మధ్య ఆధిపత్య పోరులో.. “పద ఎస్ఆర్‌కే దగ్గరే తేల్చుకుందాం” అని జుట్లు జుట్లు పట్టుకున్నారంటే.. ఏ రేంజ్‌లో సజ్జల ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి సజ్జలే కారణమని పార్టీలోని కిందిస్థాయి కార్యకర్త కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలంతా కూడా సజ్జల వల్లే ఓడినట్లు ఆరోపించారు. చివరికి విజయసాయిరెడ్డి కూడా జగన్ చుట్టూ కోటరీ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సజ్జలను తప్పించాలంటూ అంతా డిమాండ్ చేశారు కూడా. అయితే ప్రస్తుతం అదే సజ్జలకు జగన్ మరోసారి పెద్దపీట వేశారు.
Also Read : ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ నెవర్ ఎగైన్..!
రెండు రోజుల క్రితం వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించారు జగన్. పీఏసీలో కొత్తగా 33 మందిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని వెల్లడించారు. అలాగే పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం పేరుతో ప్రకటన జారీ చేశారు. ఈ కమిటీ ఎంపికపై వైసీపీ నేతలు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఎవరి వల్ల అయితే పార్టీ ఓడిందో.. వాళ్లకే మళ్లీ అవకాశం ఎలా ఇస్తారని పార్టీ అగ్రనేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి వంటి నేతల కృషి వల్లే 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని.. కానీ కేవలం సజ్జల వల్లే 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచిందంటున్నారు. మళ్లీ సజ్జలకే జగన్ బాధ్యతలు అప్పగిస్తే.. రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ వస్తుందేమో అని భయపడుతున్నారు. కొందరు నేతలైతే.. తమ రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నారు.