మనం ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం.. ఏం మాట్లాడుతున్నామనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.. పెళ్లి దగ్గర చావు మాటలు అస్సలు రాకూడదు. చావు దగ్గరకి వెళ్లి పెళ్లి మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. గుడికి వెళ్లి ఏసు క్రీస్తు గురించి ప్రార్థన చేయకూడదు.. మసీదులో రామ నామం జపించకూడదు. ఎక్కడ ఏ పని చేయాలో.. అక్కడ ఆ పనే చేయాలి. ఆసుపత్రిలో వైద్యం చేయాలి.. రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి. అంతే తప్ప… ఆసుపత్రిలో రెవెన్యూ విధులు కావాలని కోరడం ఎంత తప్పో.. కలెక్టరేట్లో వైద్య సహాయం కావాలని కూడా అంతే తప్పు. ఇలా కావాలని ఎవరైనా అడిగితే.. వారిని అవివేకులనే అంటారు. ఇంత చిన్న లాజిక్కు కూడా తెలియకుండా ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
Also Read : తీరు మారలేదు.. కారణం ఇదేనా..!
వైసీపీ ఓడిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అని గొప్పలు చెప్పిన వ్యక్తి.. ఐదేళ్లకే మాజీ అయ్యారు. దీంతో కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యారు కూడా. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో సైలెంట్‌గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. నాటి నుంచి చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి పోతున్నారు జగన్. ఎన్నికల్లో ఓడిన ఏడాది తర్వాత జగన్‌కు ఏపీ ప్రజలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకు వచ్చాయి. అందుకే పదే పదే ఏపీలో ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పర్యటిస్తున్నారు. రైతుల సమస్యలపై పోరాటం అంటూ ఇటీవల వరుసగా పర్యటనలు చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రైతుల పట్ల తనకు మాత్రమే చిత్తశుద్ది ఉందని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కూడా. కూటమి సర్కార్ రైతులను తీవ్రంగా వేధిస్తోందని.. కనీస మద్దతు ధర కూడా ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు జగన్.
Also Read : సింహపురిలో.. వరాల రొట్టె..!
ముందు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. ఆ తర్వాత పొదిలిలో పొగాకు వేలం కేంద్రంలో రైతుల దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించారు. వరుసగా రైతులపైన జగన్ ప్రేమ చూపిస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో కనీసం ఒక్క కాలువ కూడా శుభ్రం చేయలేదు. ఒక్క కాలువలో కూడా పూడిక తీయలేదు. కనీసం ఒక్క ప్రాజక్టు కూడా పూర్తి చేయలేదు. కుప్పంలో హడావుడిగా ప్రాజెక్టు పూర్తి కాకుండానే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకువచ్చి నీళ్లిస్తున్నామని చివరి రోజుల్లో హడావుడి చేశారు. అలాగే ఎన్నికలకు నాలుగు నెలల ముందు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశా.. జాతికి అంకితం చేస్తున్నా అంటూ పెద్ద మీటింగ్ పెట్టారు. కానీ ఇప్పటికీ సొరంగం తవ్వకం పనులు జరుగుతూనే ఉన్నాయి. కనీస గిట్టుబాటు ధర రావడం లేదని ఆరోపిస్తూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కోనసీమ రైతులు క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. రైతుల మీద అవ్యాజ్యమైన ప్రేమ చూపిస్తున్న జగన్.. తన పాలనలో అమరావతి ప్రాంత రైతులపై లెక్క లేనన్ని కేసులు పెట్టించారు. రైతులకు బేడీలు వేసి మరీ జైలుకు, కోర్టుకు తరలించిన ఘనత కూడా వైసీపీ సర్కార్కే దక్కుతుంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యలు చేసింది కూడా వైసీపీ నేతలే. కానీ ఇప్పుడు ఇదే వైసీపీ నేతలు రైతులకు తామెంతో చేశామని మొసలి కన్నీరు కారుస్తున్నారనేది టీడీపీ నేతల మాట.
Also Read : మరో మైలురాయిని అధిగమించిన శ్రీ సిటీ..!
ఇక బంగారుపాళ్యం వెళ్లిన జగన్.. తాను రైతులకు మద్దతుగా పోరాటం చేసేందుకు వచ్చిన విషయం మర్చిపోయినట్లు వ్యాఖ్యలు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసేందుకు వెళ్లిన జగన్.. మార్కెట్ యార్డులో కూడా బెదిరింపు ధోరణిలోనే వ్యాఖ్యలు చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని, గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరికలు చేశారు. మామిడి దిగుబడి, గిట్టుబాట ధరలపై మాట్లాడేందుకు వెళ్లిన జగన్.. తమ హయాంలో ఏం చేశామో చెప్పలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎంత ధర చెల్లించారో వెల్లడించలేదు. ఐదేళ్ల పాటు మామిడి రైతులకు తమ ప్రభుత్వం ఎంత ధర చెల్లించిందనే విషయం తెలియజేయలేదు. కానీ మళ్లీ తామే అధికారంలోకి వస్తాం.. గుర్తు పెట్టుకో.. అంటూ వార్నింగ్ ఎందుకు ఇచ్చారో మాత్రం అర్థం కావటం లేదు. ఈ వార్నింగ్ రైతులకు ఇచ్చారా.. లేక అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు ఇలా వ్యాఖ్యలు చేశారో తెలియటం లేదు. తాము అధికారంలోకి వస్తే.. రైతులకు మేలు చేస్తామని ఎవరైనా చెప్తారు తప్ప.. మేము అధికారంలోకి వస్తాం.. గుర్తు పెట్టుకోండి.. అని బెదిరించడం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్.




