ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలవుతోంది. పరిపాలన ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీల చెల్లింపు చంద్రబాబు సర్కార్‌కు తలకు మించిన భారం అవుతోంది. ఇదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లెక్కలేనంత అవినీతి జరిగిందనేది వాస్తవం. దీనిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని… బాధ్యులను కఠినంగా శిక్షిస్తామంటూ యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ టీడీపీ శ్రేణులకు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే కొంతమందిపైన కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. అయితే వాస్తవానికి ఇప్పటి వరకు చిన్న చేపలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే.. అవినీతి తిమింగలాలు ఇంకా బయటే చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి. వీటి భరతం పట్టేది ఎప్పుడు అనేది సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రశ్న.
Also Read : నాగబాబుకు వరుస షాక్‌లు..!
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలలవుతున్నా సరే.. ఇప్పటికీ వైసీపీ నేతల రాజ్యమే నడుస్తోంది అనేది బహిరంగ రహస్యం. ఇదేలా సాధ్యం అంటే.. అవుననే మాటే వినిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ అధికారులే కారణమనేది అందరికీ తెలిసిన విషయం. నాటి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారే.. ఇప్పటికీ అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులే ఇప్పటికీ అదే శాఖలో.. అవే కీలక స్థానాల్లో ఉన్నారు. దీని వల్ల నాటి ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కూటమి నేతలు బయటపెడుతున్నా సరే.. అధికారులు మాత్రం అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పదవుల్లో ఉన్న నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. ఆయా శాఖల్లోని అధికారులు మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కేస్తున్నారు.
Also Read : హమ్మయ్య.. మిథున్ రెడ్డి సేఫ్..!
గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది అప్పట్లోనే టీడీపీ, జనసేన పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీనిపై అప్పుడే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక యువగళం పాదయాత్ర సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా ఆదుదాం ఆంధ్ర పేరుతో అవినీతి చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. ప్రదానంగా నాటి మంత్రి రోజాతో పాటు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిపైన రూ.200 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాపై చర్యలు ఎప్పుడు, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి అరెస్టు ఎప్పుడు అంటూ టీడీపీ కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆడుదాం ఆంధ్ర అవినీతి గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అయినా సరే.. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Also Read : అలా వెళ్ళడానికి ఏమాత్రం సిగ్గుపడను
తాజాగా శాప్ ఛైర్మన్ రవినాయుడు కూడా టార్గెట్ రోజా అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. రోజాను అరెస్టు చేయాలంటే దమ్ముతో పని లేదని.. ఒక వారెంట్ ఉంటే చాలన్నారు. రోజాపై రవినాయుడు సుమారు 3 నెలలుగా ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. ఇందుకు ప్రధానంగా రోజా అవినీతి చేశారనే విషయంపై ఎలాంటి రుజువులు కూడా శాప్ ఛైర్మన్ రవినాయుడు దగ్గర లేవని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు అందివ్వాల్సిన అధికారులు రవినాయుడుకు సహకరించటం లేదనేది ప్రధాన ఆరోపణ. అందుకే ఇప్పటి వరకు రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిపైన కూడా ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగిన విషయంపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని.. పోలీసులు కూడా కేసులు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రంగంలోకి దిగి నాటి ప్రభుత్వ తొత్తులపై ఉక్కుపాదం మోపాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.