వచ్చే నెలలో బిజెపి జాతీయ అధ్యక్షుడు పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరికి బిజెపి పెద్దలు అవకాశం ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కేంద్రంలో బిజెపికి ఇబ్బందికర వాతావరణమే కనపడుతోంది. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన గతంలో ఉన్నంత సౌకర్యవంతమైన వాతావరణం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేయడమే కాకుండా ఓటు చోరీ అంశానికి సంబంధించి బిజెపిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంతర్జాతీయంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి.
Also Read : ఇదేం ప్యాలెస్.. రిషికొండ చూసి పవన్ షాక్..!
ఈ తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న బలాన్ని కోల్పోకుండా ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. దీనితో ఎవరికి బిజెపి అధ్యక్షుడి పదవి ఇస్తారు అనే దానిపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. అటు ఆర్ఎస్ఎస్ కూడా ఈ విషయంలో కాస్త దృష్టి పెట్టింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఈ సమయంలో దక్షిణాదికి చెందిన ఓ కీలక వ్యక్తికి బిజెపి అధ్యక్షుడిగా అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా బిజెపి జాతియ అధ్యక్షుడు ఎంపిక ప్రస్తావనకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కర్ణాటక లేదా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించే సూచనలు ఉన్నాయని అందుకే వెంకయ్య నాయుడు సలహాలను మోడీ తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈసారి మాత్రం రాజకీయంగా ప్రతిపక్షాలపై దూకుడుగా విమర్శలు చేసే నాయకుడు కావాలని బిజెపి భావిస్తోంది. విపక్షాలు చేసే ఆరోపణలకు సమాధానం ఇచ్చే సమర్థమైన నాయకుడిని ఎన్నుకోవాలని ఎప్పటినుంచో బీజేపీ భావిస్తుంది.
Also Read : ఎక్కడన్నా..? వైసీపీ కార్యకర్తలకు దొరకని జగన్
ఈ విషయంలో పలువురి పేర్లను వెంకయ్య నాయుడు మోడీ ముందు ఉంచినట్లు సమాచారం. దక్షిణాదిలో పార్టీ బలోపేతం కోసం ఎప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్న బిజెపి పెద్దలు ఈసారి దక్షిణాదికి చెందిన సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. తమిళనాడులో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమిళనాడుకు చెందిన పి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక బిజెపి జాతియ అధ్యక్షుడిగా కర్ణాటక కు చెందిన వ్యక్తికే అవకాశం కల్పించే సూచనలు కనపడుతున్నాయి. దీనిపై ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత బిజెపి అధిష్టానం దృష్టిపెట్టే అవకాశం ఉందని సమాచారం.