మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ కి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక అందించింది. పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు రిజిస్టర్ చేసినట్టుగా గుర్తించారు. కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్.. అలాగే ఆయన టీం ఉన్నట్టుగా తెలుస్తోంది. పుంగనూరు ఆర్డీవోలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డిలకూ ప్రమేయం ఉందని గుర్తించారు. వీరిపై కేసులు పెట్టాలనీ సిఫార్సు చేసారు విజిలెన్స్ అధికారులు.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదికను ఒకసారి పరిశీలిస్తే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో రూ.100 కోట్లకు పైగా విలువైన 982.48 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టారు. పలమనేరు ఆర్డీవో లుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి, నాటి పలమనేరు తహసీల్దార్ సీతా రామ్, లబ్దిదారులతో కుమ్మక్కైనట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి అయింది.
వీరంత నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వభూముల మ్యుటేషన్ అక్రమాలు చేసినట్లు గుర్తించారు. డీఎన్ఎస్, భూకట్టా చట్టాల్లోని అక్రమ చొరబాటు, మోసం, పోర్టరీ తదితర సెక్షన్ల కింద వీరందరిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బినామీల పరమైన 982 ఎకరాలు.. తిరిగి ప్రభుత్వానికి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ భారీ కుంభకోణం వ్యవహారంలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే దానిపై చిత్తూరు జిల్లా ప్రజలతో పాటుగా వైసీపీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు.