తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్. బీసీ రిజర్వేషన్ బిల్లుకు హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతలంతా ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది ప్రధాన పార్టీల లక్ష్యం. ఈ ఎన్నిక ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతోంది. సిట్టింగ్ స్థానం ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు.. హైదరాబాద్ జంట నగరాల్లో తొలి ఎమ్మెల్యే సీటు సంపాదించాలని కాంగ్రెస్ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక ఇరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
Also Read : బీహార్ పై బిజెపి ఫోకస్.. సంచలన ప్రకటన రానుందా..?
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వరుసగా 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. అలాగే సునీత గెలుపు బాధ్యతను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారు. ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ నేత నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. నవీన్ గెలుపు బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. అలాగే ఈ ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక ఇరు పార్టీలకు చాలా కీలకంగా మారింది.
నవంబర్ 11న పోలింగ్.. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీంతో ఇరు పార్టీల నేతలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. అయితే ఇక్కడే ఓ విషయం రెండు పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు రెబల్స్ బెడద తప్పేలా లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ పోటీకి సిద్ధమయ్యారు. మాగంటి గోపీనాథ్ సంతాప సభను వజ్రనాథ్ తన కార్యాలయంలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు కూడా. టికెట్ తనకిస్తే తప్పకుండా గెలుస్తామని అప్పట్లో చెప్పారు కూడా. అయితే సునీతకు ఇవ్వడంతో.. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. వజ్రనాథ్ వర్గం మాత్రం.. బీఆర్ఎస్కు దూరంగా ఉంది. వజ్రనాథ్ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందనే మట వినిపిస్తోంది కూడా.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్..!
ఇక కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్‌తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టికెట్ కోసం ఎంతో ప్రయత్నం చేశారు. అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. తనకు టికెట్ రాకుండా పొన్నం అడ్డుకున్నారని అంజన్ కుమార్ యాదవ్ తన వర్గం నేతల దగ్గర ఇప్పటికే వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ అయితే బాగుంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాను బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన పుకార్లపై రామ్మోహన్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారం అన్నారు. కానీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ మాత్రం.. రెబల్‌గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా పొన్నంకు చెడ్డపేరు తీసుకురావాలనే లక్ష్యంతోనే అంజన్ కుమార్ యాదవ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. రెబల్‌గా పోటీ చేసి నవీన్ యాదవ్‌ను ఓడించాలనే లక్ష్యంతో అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి రెబల్స్ బెడద ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుంది.