తెలుగుదేశం పార్టీ అంటే చాలు ప్రతి ఒక్కరికీ మే 28వ తేదీ గుర్తుకు వస్తుంది. అందుకు ప్రధాన కారణం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుట్టినరోజు కావడమే. ఓ జాతీయ పార్టీకి ధీటుగా ప్రాంతీయ పార్టీ స్థాపించి.. కేవలం 9 నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన రికార్డు తెలుగుదేశం పార్టీ సొంతం. ఇక ప్రతి ఏటా పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. రాబోయే ఏడాది కాలానికి సంబంధించిన తీర్మానాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. అధికారంలో ఉన్నా, లేకున్నా కూడా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. 2019లో పార్టీ ఓడిన తర్వాత మహానాడు నిర్వహణను నాటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. అయినా సరే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం 2022లో ఒంగోలులో, 2023లో రాజమండ్రిలో మహానాడు ఘనంగా నిర్వహించి వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అయితే గతేడాది 2024లో మాత్రం మహానాడు నిర్వహించలేదు. ఇందుకు ప్రధానంగా ఎన్నికల ఫలితాలే కారణం. మే 27, 28వ తేదీల్లో మహానాడు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4న ఫలితాలు విడుదల అని ఎన్నికల సంఘం ముందే ప్రకటించింది. దీంతో ఎన్నికల నియమావళి కారణంగా గతేడాది మహానాడు వాయిదా పడింది.
Also Read : పొత్తు నియమం పాటిస్తున్నట్లేనా..?
2019లో ఓటమి బాధతో మహానాడు నిర్వహించలేదు. ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి కారణంగా కేవలం జూమ్ మీటింగ్‌లోనే మహానాడు నిర్వహించారు. దీనివల్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు సైతం కొంత ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో అధికార పార్టీ నేతలు టీడీపీ పని అయిపోయిందంటూ విమర్శలు కూడా చేశారు. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ… 2022లో ఒంగోలులో మహానాడు నిర్వహించారు. అనుమతుల పేరుతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు కల్పించినా, ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా ఆంక్షలు విధించినా.. పార్టీ అభిమానులు, కార్యకర్తలు మాత్రం.. సభను విజయవంతం చేశారు. ఒంగోలు మహానాడుకు సుమారు 5 లక్షల మంది హాజరైనట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఆ తర్వాత ఏడాది రాజమండ్రిలో జరిగిన మహానాడుతో వైసీపీ ఓటమి ఖాయమైంది. మహానాడు గ్రాండ్ సక్సెస్‌తో తెలుగు తమ్ముళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ఏడాదిలో పని చేశారు. మినీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో తెలుగుదేశం పార్టీ ఏకంగా 135 స్థానాల్లో ఘన విజయం సాధించింది.
Also Read : పెద్దిరెడ్డి టార్గెట్ గా పవన్ సంచలన అడుగులు
అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు మరింత గ్రాండ్‌గా నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు భావించారు. అయితే ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కడప నగరం పరిసరాల్లో పబ్బాపురం గ్రామం వద్ద మహానాడు సభ నిర్వహించేందుకు 120 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. మహానాడును 3 రోజుల పాటు నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. మహానాడు నిర్వహణపై లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. కడపలో మే 27,28 తేదీల్లో ప్రతినిధుల సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. మే 29న బహిరంగ సభ నిర్వహించనున్నారు. పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సూచించారు. వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. తొలిరోజు టీడీపీ విధివిధానాలు, సిద్దాంతాలు, కార్యాచరణపై చర్చ జరగనుంది. రెండో రోజు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీర్మానాలపై చర్చిస్తారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
Also Read : బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
టీడీపీ సాంప్రదాయకంగా ఏటా మే 27–29 తేదీల్లో మహానాడు నిర్వహిస్తుంది. ఈ ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్వహించాలనే నిర్ణయం పార్టీ తన పట్టును బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి సుమారు 25 వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని ఆశిస్తున్నారు. ఇక చివరి రోజున ఏకంగా పది లక్షల మందితో భారీ స్థాయిలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. కడపలో నిర్వహించడం ద్వారా తమ సంస్థాగత నైపుణ్యాన్ని ప్రదర్శించాలని టీడీపీ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.