వైసీపీకి ‘ రివర్స్ ‘ షురూ!
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఎపి ఎన్నికల ముఖచిత్రం స్పష్టమయింది. ఒకరకంగా తెలంగాణ ఎన్నికలు ఎపి ఎన్నికలకు రిహార్సల్ గా పేర్కొనవచ్చు. ఎన్నికల యుద్ధంలో సంక్షేమ పథకాల లబ్దిదారులు, అధికార బలం, ఆర్థిక వనరులు వంటివి అధికార పార్టీకి కవచంగా వుండి రక్షిస్తాయన్న సందేహాలు ఇప్పటివరకు చాలా మందిలో వున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహాలన్నీ తొలగిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక వెల్లువలో అధికార పార్టీ అమ్ముల పొదిలోని అస్త్రాలు అన్నీ నిర్వీర్యం కాక మానవు అని తెలంగాణ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ అధికార పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది అని చెప్పవచ్చు.
తాజాగా తెలంగాణ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకుల్లో గుబులు రేకెత్తించాయి.
తెలంగాణ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనేది తేటతెల్లమైంది. ప్రభుత్వ వ్యతిరేకత తో పాటు కాంగ్రెస్ పట్ల సానుకూలత సైతం తోడయ్యింది. సరిగ్గా ఇదే తరహా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోనూ నెలకొని వున్నాయి. అధికార వైఎస్సార్సీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తారాస్థాయిలో వున్నట్టు ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్ల అన్నివర్గాలలో సానుకూలత నెలకొని వుంది. తెలుగుదేశం పార్టీని మించి చంద్రబాబు పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు అధికార పార్టీ పై వ్యతిరేకత మరోవైపు విపక్ష పార్టీ పట్ల సానుకూలత ఏకకాలంలో వ్యక్తమవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం తెలంగాణ తరహాలోనే ఉన్నదన్న వాదన వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత వున్నప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవటంలో తెలుగుదేశం పార్టీ ఎంతమేరకు సఫలీకృతం అవుతుందనే విషయంలో సామాన్య ప్రజానీకంలో నూ పలు సందేహాలు నెలకొని వున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అధికార బలం, ఆర్థిక వనరుల లభ్యత, తదితర అంశాలు అధికారపార్టీ కి అనుకూలించే అంశాలుగా వున్నాయి. వాటన్నింటినీ ప్రతిపక్ష తెలుగుదేశం దీటుగా ఎదుర్కొన లేదన్న సంశయం సామాన్య ప్రజానీకంలోనే కాదు టిడిపి వర్గాల్లోనూ నెలకొని వున్నది. అయితే ఈ సందేహాలు అన్నింటికీ తెలంగాణ ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పాయి. దేశంలోనే అత్యధికంగా సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ కు ప్రత్యేక గుర్తింపు వున్నది. తెలంగాణ లో అమలు జరిపిన దళిత బందును మించిన సంక్షేమ పథకం దేశంలోనే లేదు. పెద్ద సంఖ్యలో పింఛన్లు, కంటి వెలుగు వంటి కార్యక్రమాలు ద్వారా అత్యధిక శాతం మంది లబ్దిపొందారు. వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్ అందించటంతో పాటు ప్రభుత్వం అమలు జరిపిన రైతుబంధు పథకం రైతాంగానికి బాగా లబ్ది చేకూర్చింది. వీటన్నింటికీ తోడు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించే పథకం తెలంగాణలో నూరుశాతం అమలయింది. అయినప్పటికీ ప్రభుత్వంపై ప్రజల్లో ప్రబలిన వ్యతిరేకతను సంక్షేమ పథకాలు నిలువరించలేకపోయాయి.పాలనా యంత్రాంగంపై అధికార పార్టీకి వున్న పూర్తిస్థాయి పట్టు సైతం ఎన్నికలలో ఎందుకూ కొరగాకుండా పోయింది. ఆర్థిక వనరుల విషయంలో బి ఆర్ ఎస్ పార్టీ కి సాటి మరొకటి లేదు. దేశంలోని అత్యంత ధనిక రాజకీయ పార్టీలలో బి ఆర్ ఎస్ ఒకటి. జాతీయ పార్టీగా ప్రకటించిన అనంతరం ఢిల్లీ లో సైతం బి ఆర్ ఎస్ పార్టీ కి కళ్ళుచెదిరే రీతిలో కార్యాలయం నిర్మాణం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం మొత్తాన్నీ భరించే స్థాయికి బి ఆర్ ఎస్ ఎదిగింది. ప్రభుత్వ, పార్టీ పరంగా ఇన్నిరకాల సానుకూలత లు వున్నప్పటికీ బి ఆర్ ఎస్ అధికారాన్ని నిలుపుకోలేక పోయింది. తన తొలి ఎన్నికలో మినహా ఏనాడూ ఓటమి ఎరుగని బి ఆర్ ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు సైతం ఈ ఎన్నికలలో రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఒక స్థానంలో పరాజయం పొందారు. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే తరహా పరిణామాలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎపిలో ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు చెబుతున్న సంక్షేమ పథకాలు, అధికార బలం, ఆర్థిక వనరుల సానుకూలత వంటి అంశాలు అధికార పార్టీకి ఏమేరకు ఉపకరిస్తాయనే ధీమా తెలంగాణ ఫలితాలతో సడలిపోయింది. ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లోనే కొంచెం అధికంగా ఉందని చెప్పవచ్చు. అభివృద్ధి కార్యక్రమాల లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను పోల్చి చూసే పరిస్తితి లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకూ అధికమవుతోంది.
తెలంగాణ, ఎపి రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతల వ్యవహార శైలి సైతం ఇంచుమించు ime తరహాలో వుందని చెప్పవచ్చు. ఎపి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లోనూ, తెలంగాణ మాజీ సిఎం వ్యవసాయ క్షేత్రంలోనూ ఎక్కువ సమయం గడపటం చూసాం. ఎమ్మెల్యేలను మాత్రమే కాదు, సామాన్య ప్రజానీకాన్ని సైతం వారు కలిసింది చాలా తక్కువ సందర్భాల్లోనే. పార్టీ, పాలన, వ్యక్తుల పరంగానూ ఎపి, తెలంగాణ లో అధికార పార్టీలు గా వున్న వైసీపీ, బి ఆర్ ఎస్ ల మధ్య ఎన్నో సారూప్యత లున్నాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ ఎన్నికలలో ప్రభావం చూపిన అంశాలే ఎపి ఎన్నికలలో నూ ప్రాధాన్యతాంశాలు గా ఉంటాయన్న విషయం స్పష్టమవుతోంది.
ఈ విధమైన పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న ఎన్నికలు అధికార, విపక్ష పార్టీలు రెండింటికీ విషమ పరీక్షే. కేవలం అధికారం కోసమే కాకుండా, ఆయా పార్టీల అస్తిత్వానికి సైతం రానున్న ఎన్నికలలో విజయం సాధించటం అనివార్యమని చెప్పవచ్చు.