తెలుగు దేశం పార్టీకి యువగళం పాదయాత్ర అనేది ఎంతో మేలు చేసింది. నారా లోకేశ్ ఈ పాదయాత్ర మొదలు పెట్టిన నాటితో పోల్చితే.. ఇప్పుడు ఆ యాత్ర ముగిసేనాటికి ఎంతో మార్పు చూడవచ్చు. లోకేశ్ కు వ్యక్తిగతంగానే కాక, పార్టీకి కూడా ఎంతగానో ఆదరణను యువగళం పాదయాత్ర తెచ్చిపెట్టింది. అయితే, ఇలా రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన వాళ్ళకు తగిన ప్రతిఫలం దక్కుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండోసారి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వల్లే ముఖ్యమంత్రులు అయ్యారు. పాదయాత్ర వల్ల వ్యక్తిగతంగా కూడా మేలు జరుగుతుంది. అలాంటి ప్రతిఫలమే నారా లోకేశ్ కు దక్కినట్లుగా ప్రస్తుతం స్పష్టంగా అర్థం అవుతోంది.
నారా లోకేష్ పాదయాత్ర 226 రోజులు సాగింది. 97 నియోజకవర్గాల్లో.. 3,132 కిలో మీటర్లు లోకేశ్ నడిచారు. కానీ, లోకేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి ఈ యాత్ర చేయలేదు. టీడీపీకి పునర్‌వైభవం తీసుకురావటమే లక్ష్యంగా, పార్టీని ఏపీలో మళ్లీ అధికారంలో కూర్చోబెట్టే లక్ష్యంతో పాదయాత్ర చేశారు. యాత్ర మొదలైన తొలి రోజుల్లో ఎన్నో నోర్లు ఆయన్ను విమర్శించేవి. పాదయాత్ర లోకేశ్ తో కాని పని అని, దానివల్ల పార్టీకే నష్టం జరుగుతుందనే మాటలు వినిపించాయి.
కానీ, కొద్ది రోజులకే లోకేశ్ తన సత్తా ఏంటో చూపించారు. అడ్డమైన వ్యాఖ్యలు చేసిన వారి నోర్లు మూయించారు. యువగళంలో తన వెంట నడుస్తున్న అశేష జనవాహినిని చూసి కొద్ది రోజులకే అధికార పక్షానికి భయం మొదలైంది. అంతేకాకుండా, ప్రసంగాల్లో కూడా నారా లోకేశ్ బాగా పదును తేలారు. తన సమయస్ఫూర్తితో, పంచ్‌లతో అధికార పార్టీ నేతల అక్రమాలను ఎండగట్టారు. ఈ అంశాలతో టీడీపీకి బాగా ఊపు వచ్చింది. జనాల్లో లోకేశ్ పాదయాత్రపై పాజిటివ్ టాక్ బాగా పెరిగిపోయింది. యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ విజయం ఖాయమని అప్పుడే తేలిపోయింది.
పైగా, యువగళం పాదయాత్రలో లోకేశ్ బిజీగా ఉండగా, అనుకోని అవాంతరం ఏర్పడినప్పుడు లోకేశ్ అన్ని సమస్యలను ఒంటరిగా పరిష్కరించగలిగారు. గత సెప్టెంబరులో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను చాలా సమర్థంగా చక్కబెట్టారు. ఢిల్లీకి వెళ్లి న్యాయనిపుణులతో సంప్రదించడం.. మరోవైపు, ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు, టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఢిల్లీ నుంచే రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసేవారు. పార్టీ అధినేత లేని సమయంలో సమర్థంగా వ్యవహారాలను చక్కబెట్టారనే పేరు సంపాదించారు. ఇప్పుడు టీడీపీలో నేతలకు లోకేశ్ అంటే ఎనలేని గౌరవం పెరిగింది. పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ, క్షేత్ర స్థాయిలో మరింత రాటుదేలి ప్రజా అభిమాన నేతగా కూడా లోకేశ్ పేరు తెచ్చుకున్నారు.