ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం లో అత్యంత కీలకంగా భావిస్తున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి నేడు హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాదాపు రెండు నెలల క్రితం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్ కోసం మిథున్ రెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. అయితే సిట్ అధికారులు లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి స్నేహితులపై ఫోకస్ పెట్టినట్లు అధికార వర్గాలు అంటున్నాయి.
Also Read : ప్రజల నిర్ణయమే ఫైనల్..!
మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో.. ఆయన సన్నిహితులు ప్రభుత్వ వర్గాల్లో కీలకపాత్ర పోషించారు. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కూడా వాళ్లే కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని మాజీ మంత్రి నారాయణస్వామి అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. లిక్కర్ కంపెనీలతో మంత్రిగా ఉన్న నారాయణస్వామి పేషీలో.. ఒప్పందాలు కూడా చేయించినట్లు తేల్చారు.
Also Read : ఆస్ట్రేలియా వెళ్ళండి.. సీనియర్లకు బోర్డు ఆర్డర్
అలాగే నిధులను విదేశాలకు తరలించే విషయంలో కూడా మిథున్ రెడ్డి సన్నిహితులే కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన అత్యంత సన్నిహితులతో లిక్కర్ కుంభకోణంలో కథ మొత్తం మిథున్ రెడ్డి నడిపినట్లు తేలింది. ఇదే కేసులో అవసరమైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. సచివాలయంలో నారాయణస్వామి పేషీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలను అధికారులు అమలు చేసినట్లు కూడా గుర్తించారు. లిక్కర్ కేసు మొదలైన తర్వాత మిధున్ రెడ్డి సన్నిహితులు బెంగళూరు నుంచి విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే వారికి సంబంధించిన సమాచారాన్ని మిథున్ రెడ్డి సిట్ అధికారులు అడగగా దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదట.