నారా లోకేష్ గొప్ప అవకాశవాది.. ఇప్పుడు ఇదే మాట సోషల్ మీడియాలోనే కాదు.. పొలిటికల్ సర్కిల్‌లో కూడా బాగా వినిపిస్తున్న మాట. వాస్తవానికి అవకాశ వాదం అనే మాట స్వార్థపరులకు అన్వయిస్తారు. తమ స్వార్థం కోసం ఎదుటి వారికి చేటు చేస్తూ.. తాము లాభం పొందే వారినే అవకాశవాదులంటారు. మరి ఈ పేరు ఇప్పుడు మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి ఎందుకు అంటున్నారనేది హాట్ టాపిక్. నారా లోకేష్ తన స్వార్థం కోసం ఏం చేశారు.. ఎదుటి వారిని కాదని.. లాభం పొందేలా ఏం పని చేశారు.. అనేదే ఇక్కడ అసలు రహస్యం.
Also Read : నాయర్ సెకండ్ ఛాన్స్ అయిపోయిందా..?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చారు నారా లోకేష్. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత నారా లోకేష్‌ను మంత్రిని చేశారు చంద్రబాబు. నాటి ప్రభుత్వంలో కీలకమైన ఐటీ శాఖ నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా లోకేష్‌ను చంద్రబాబును మండలికి పంపారు. తన శాఖను సమర్థవంతంగా నిర్వహించిన లోకేష్.. అప్పట్లోనే ఏపీకి పెట్టుబడులు సాధించడంలో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఓడిపోయారు. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుతో పాటు వైసీపీ సానుభూతి పరులైన బోరుగడ్డ అనిల్ వంటి వాళ్లు కూడా నోటికి వచ్చినట్లు కామెంట్లు చేశారు. వ్యక్తిత్వ హననం చేశారు. దొడ్డి దారిలో మంత్రిపదవి దక్కించుకున్నాడని.. ఎమ్మెల్యేగానే గెలవలేకపోయాడని విమర్శలు చేశారు. ఇక యువగళం పాదయాత్ర గురించి లోకేష్ ప్రకటన చేయగానే.. పది కిలోమీటర్లు అయినా నడుస్తాడా.. అని ఎద్దేవా చేశారు. అయితే లోకేష్ మాత్రం ఇవేవీ లెక్క చేయలేదు. తన లక్ష్యం దిశగా అడుగులు వేసి అనుకున్నదే సాధించారు.
లోకేష్ మంగళగిరిలో గెలిస్తే.. రాజకీయాల నుంచే తప్పుకుంటా అని కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు బహిరంగ సవాల్ విసిరారు. కానీ అనూహ్యంగా 90 వేల ఓట్ల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు లోకేష్. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో కీలకమైన విద్యా శాఖతో పాటు ఐటీ శాఖ కూడా నిర్వహిస్తున్నారు. లోకేష్ సారధ్యంలో ఏపీలో టీసీఎస్ వంటి బడా సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో మరో భారీ పరిశ్రమను ఏపీకి రాబట్టంలో లోకేష్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. రైతుల నిరసనల నేపథ్యంలో ఏరోస్పేస్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లే పరిస్థితి లేదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే అదునుగా భావించిన మంత్రి నారా లోకేష్.. ఏరో స్పేస్ పరిశ్రమను ఏపీకి ఆహ్వానించారు. అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి ఏపీలో అవకాశాలను పరిశీలించమని ఏరో స్పేస్ ఇండస్ట్రీస్‌ను లోకేష్ కోరారు.
Also Read : పాపం ఆయన సంగతేంటి..? మాజీ సీఎం ఎదురు చూపులు..!
మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ కంపెనీలను ఏపీకి ఆహ్వానించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, హుబ్బళ్లి ధార్వాడ్ డెవలప్‌మెంట్ ఫోరమ్ కోశాధికారి సీఎస్‌వీ ప్రసాద్ తనదైన శైలిలో స్పందించారు. పారిశ్రామిక అభివృద్ధికి భూమి అనేది ప్రాథమిక అవసరం. పెట్టుబడులు పెట్టడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదపడటానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు భూమిని గుర్తించి కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని గుర్తు చేశారు. అయితే కర్ణాటకలో తాను మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి చూస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటకలో గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిపాదనలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సారవంతమైన భూమి అనే కారణాలతో పునరాలోచిస్తోందన్నారు. కొందరు రైతులు త్యాగం చేసినప్పుడు, వారి సహకారం పారిశ్రామికీకరణ, రైల్వే లైన్ నిర్మాణాల ద్వారా రాష్ట్రం, ఇతర రైతులకు అభివృద్ధికి కూడా దారి తీస్తుందన్నారు. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఉన్నట్లుగా, భూ సమీకరణ వంటి విధానాలు ప్రభుత్వానికి ఉండాలని ప్రసాద్ సూచించారు. భూ యజమాని భూమిని కోల్పోడు, కానీ అభివృద్ధి చెందిన భూమిలో వాటా పొందుతాడు. కర్ణాటక నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో విఫలమైతే, ఈ పరిశ్రమలు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో సిద్ధంగా ఉన్న పొరుగు రాష్ట్రాలకు తరలిపోతాయని… ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రసాద్ కోరారు.
ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏరో స్పేస్ పరిశ్రమ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇదే సరైన సమయం అని భావించిన లోకేష్… వెంటనే రంగంలోకి దిగారు. కర్ణాటకలో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను ఏపీకి అనుకూలంగా మలుచుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, ఏపీలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్న లోకేష్.. ఏరోస్పేస్ పరిశ్రమ ఏపీకి రావాలని కోరారు. ఇందుకోసం ఏకంగా 8 వేల ఎకరాలు కేటాయించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. దీనిపై ఏరో స్పేస్ ఇండస్ట్రీస్ కూడా సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే ఏపీ సర్కార్‌తో చర్చలు జరిపేందుకు అంగీకరించాయి.
Also Read : అసలు.. వాళ్లిద్దరు ఎందుకు కలిశారు.. కారణాలేమిటీ..?
వాస్తవానికి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దేవనహల్లికి సమీపంలో ఎక్కువగా వున్నవి బడా రాజకీయ నాయకుల ఫార్మ్ ల్యాండ్స్. ఆ భూముల సేకరణను ఆపడానికి పోరాటం పేరుతో డ్రామా ఆడారు. దీంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను సేకరించడం లేదు అని తేల్చి చెప్పింది. ఒక రాష్ట్రంలో ఎదురైన సమస్యను అవకాశంగా మలచుకొని, తన రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలనే లోకేష్ ఆలోచన బహుముఖ ప్రయోజనకారిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో ఏరో, స్పేస్, డిఫెన్స్ పాలసీలు ప్రకటించి, ఆ పరిశ్రమలు కర్ణాటక సమీపంలోని అనంతపురం వైపు వస్తే లేపాక్షి సెజ్ నుండి సేకరించిన భూములు ఇవ్వడానికి సిద్ధం చేసి, సమయస్ఫూర్తి ప్రదర్శించారు లోకేష్.
లోకేష్ తీరుపై కర్ణాట పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలను చాకచక్యంగా ఏపీకి రాబట్టడం ద్వారా పక్క రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని విమర్శలు కూడా చేస్తున్నారు. మొత్తానికి అందివంచిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గొప్ప అవకాశవాదిగా లోకేష్ గుర్తింపు తెచ్చుకున్నారు.