తెలంగాణాలో నాలుగు జిల్లాలను వరద ముంపు ఇబ్బంది పెట్టడంతో తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద వరుస పర్యటనలు చేస్తున్నారు. వరద బాధితులకు సహాయ సహకారాలు అందించే దిశగా రేవంత్ ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సూర్యాపేట, వరంగల్, ములుగు, ఖమ్మం జిల్లాలకు భారీ ఎత్తున వరద రావడంతో రేవంత్… ఆ జిల్లాల్లో మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారు. నేడు సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో ఆయన స్వయంగా పర్యటించి.. పరిశీలించారు.
పాలేరు అలుగు వరద ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇతర మంత్రులు పొంగులేటి, ఉత్తమ కుమార్, కోమటిరెడ్డి తో కలిసి పరిశీలించారు. ఇక వరద తీవ్రతను స్వయంగా చూసిన రేవంత్ రెడ్డి… బాధితులకు ఇచ్చే నష్ట పరిహారాన్ని కూడా తక్షణమే పెంచారు. నాలుగు లక్షల నష్ట పరిహారాన్ని 5 లక్షలు చేస్తున్నామని, అలాగే మేకలు, గొర్రెలు మరణించిన వారికి ఒక్కింటికి 5 వేలు ఇస్తామని, గేదెలు లేదా ఆవులు మరణించిన వారికి 50 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం విషయంలో జాప్యం జరగకుండా చూస్తా అని హామీ ఇచ్చారు.
ఇక వరద ముంపు క్రమంగా తగ్గడంతో సహాయక కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు రేవంత్. అటు కేంద్రం సాయం విషయంలో కూడా రేవంత్ రెడ్డి దూకుడుగానే వెళ్తున్నారు. ఇప్పటి వరకు 5 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేయడంతో… కేంద్రానికి లేఖ రాసారు. తక్షణమే 2 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహాయక కార్యక్రమాలకు 5 కోట్లు ఒక్కో జిల్లాకు విడుదల చేసారు. అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్.