ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన వరుస ప్రమాదాలు కంగారు పెట్టాయి. అచ్యుతాపురంలో జరిగిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం కలవరపెట్టింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేసారు. నిన్న ఫార్మాసిటీలో జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, బాధపడుతున్నా అన్నారు ఆయన. ఈరోజు ఈ సంఘటన నాకు చాలా బాధేసింది. మనసును కూడా కలచివేసింది. ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అని స్పష్టం చేసారు.
గడిచిన ప్రభుత్వం వ్యవస్థలను సర్వనాశనం చేశారు. అవన్నీ బాగుచేసే క్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తోంది అన్నారు ఆయన. ఈ సంఘటన వల్ల 17 మంది చనిపోయారు అని… 36 మంది గాయపడ్డారు అన్నారు. మరణించిన వారికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని అన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు అన్నారు. 26 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్ధితిని వైద్యుల నుంచి తెలుసుకున్నాను. ప్రమాదంలో గాయపడిన అందరినీ కలిసి వారితో మాట్లాడానన్న చంద్రబాబు… వారితో ఒకటే చెప్పాను.. ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా ఇచ్చాం అన్నారు.
ఎన్నిరోజులైనా పర్వాలేదు ప్రభుత్వం అన్నీ చూసుకుంటుందని చెప్పామని తెలిపారు. వీరిలో ఒకరికి 57 శాతం కాలిన గాయాలయ్యాయని అతనితో కూడా మాట్లాడాను చాలా ధైర్యంగా ఉన్నాడన్నారు. మరొకరికి 24 శాతం, ఇంకొకరికి 12 శాతం, మరొకరికి 10 శాతం కాలిన గాయాలయ్యాయి. ఒకరు ప్రమాదం జరిగిన షాక్ లో ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు. బాగానే ఉన్నారు అన్నారు చంద్రబాబు. ఈ ఘటన విషయంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కోటి పరిహారం అనే నిర్ణయం వైసీపీకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీనిపై జగన్ రాజకీయం చేయాలని భావించినా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ షాక్ లో ఉంది.