వైసీపీ సోషల్ మీడియా అంటే ప్రజలకు ఓ అభిప్రాయం ఉంటుంది. మహిళల విషయంలో వాళ్ళు చేసే వ్యాఖ్యలు, వాళ్ళు పోస్ట్ చేసే అసభ్య ఫోటోలు ఇలా దాదాపుగా అన్నీ వివాదాస్పదమే. ఏ మాత్రం జాలీ, దయ లేకుండా తమ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళ పంథాలో ఏ మాత్రం మార్పులు రాలేదనే మాట వాస్తవం. నాయకులు కూడా అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అదే పంథా ఫాలో అవుతోంది.
అధికారం కోల్పోయామనే బాధ కంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని వాళ్ళు ఊహించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ అధిష్టానం సమస్య కూడా ఇదే. ఇప్పుడు ఇదే కోపాన్ని మహిళా నాయకుల విషయంలో చూపించడం మొదలుపెట్టారు. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అనుకున్నారో ఏమో గాని… గిరిజన, బీసీ నేతలు అని కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా చూడటం లేదు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ విషయంలో అత్యంత దారుణంగా పోస్ట్ లు చేస్తోంది సోషల్ మీడియా.
Read Also : పోలవరంపై మాట నిలబెట్టుకుంటున్న మోడీ…!
ఇటీవల బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు నూలు పోగు వేస్తారు మెడలో. దాన్ని గురించి అభ్యంతరకర పోస్ట్ లు పెట్టింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. అదే విధంగా సీతక్క ఆహార్యం గురించి కూడా సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేసారు. శాసన సభలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇక రఘునందన్ రావు ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారు. తన అక్కలాంటి సురేఖకు నూలు పోగు వేస్తే వచ్చిన తప్పేంటి అంటూ… ఈ విషయాన్ని తాను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. రాజకీయాల్లో కోపాలు ఉండవచ్చు గాని ఇలా ఉచ్చ నీచాలు మరిచి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఏ రాజకీయ పార్టీకి తగదు. ఇలాంటి వారికి ప్రభుత్వాలు తగిన బుద్ది చెప్పకపోతే వీరిని చూసి మరికొందరు తయారవడం ఖాయం.