తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడ ఎలాంటి పురోగతి లేదని భావించిన బీఆర్ఎస్ నేతలు.. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించాలంటూ నేరుగా సుప్రీం కోర్టులోనే పిటీషన్ దాఖలు చేశారు. దీంతో నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ వెంటనే పరిణామాలు వేగంగా మారిపోయాయి.
Also Read : ఐ బొమ్మ.. దేనికి భయపడేది లేదు..!
ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిలో నలుగురిని ఇప్పటికే విచారించారు కూడా. వారి వివరణ తీసుకున్న తర్వాతే స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఎమ్మెల్యేలు కొత్త పాట పాడుతున్నారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. తమ నియోజకవర్గం సమస్యలపై చర్చించేందుకు వెళితే.. ముఖ్యమంత్రి 3 రంగుల కండువా కప్పారని కొత్త మాట చెబుతున్నారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటున్నారు.
బీఆర్ఎస్‌లో ఉంటే పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనేది ఆ పార్టీ నేతల మాట. ఇదే విషయంపై పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, అరికెపూడి గాంధీకి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. గాంధీ ఇంటికి వెళ్లి తేల్చుకుంటామని కౌశిక్ రెడ్డి చెప్పడం పెద్ద దుమారం రేపింది కూడా. ఈ విషయంపై గాంధీ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అవసరమైతే నేరుగా కేసీఆర్‌ను కలుస్తా అని కూడా సవాల్ చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేదు.
Also Read : తెలంగాణాలో పింక్ బుక్ లేదు.. సోషల్ మీడియా జాగ్రత్త.. డీజీపీ సంచలన కామెంట్స్
తాజాగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలె యాదయ్యకు గులాబీ పార్టీ నేతలు సవాల్ విసిరారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ ఫిరాయించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు కార్యకర్తలు కుర్చీ కేటాయించారు. “పార్టీ ఫిరాయించలేదని చెప్తున్న కాలె యాదయ్య గారు, కుర్చీ కేటాయించాం రండి కూర్చోండి” అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మైకులో పిలుపునిచ్చారు. కాలె యాదయ్య బీఆర్ఎస్‌లో ఉన్నారా.. లేక కాంగ్రెస్ పార్టీలో చేరారా అనే విషయం ఈ వేదిక మీదే తెలుస్తుంది అంటూ సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్ పార్టీలో, ఇటు బీఆర్ఎస్‌లో ఈ సభ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.