గత పదేళ్ళ నుంచి మనం దేశ రాజకీయాలను గమనిస్తే… ప్రతిపక్షాల ముఖ్యమంత్రులకే కాదు ఎన్డియే ముఖ్యమంత్రులకు కూడా ఉక్కపోత వాతావరణం ఉండేది. రాజకీయంగా బిజెపి బలంగా ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా సినిమా ఉండేది. కాని తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి విషయంలో సీన్ కంప్లీట్ గా రివర్స్ లో కనపడుతోంది. మరి రేవంత్ కేంద్ర పెద్దలకు ఏం మంత్రం వేసాడో గాని, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా రేవంత్ పని తీరుకు ఫిదా అవుతున్నారు. అసలు రేవంత్ ఇప్పుడు ఏ పార్టీనో అర్ధం కాక బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి చెందిన VLF కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్ రాడార్ సెంటర్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా శంకుస్థాపన చేసారు. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఏ వైపు నుంచి చూసినా కనీసం 400 కిలోమీటర్లు ఉంటుంది వికారాబాద్ కు సముద్ర తీరం. కానీ అక్కడ నేవీ రాడార్ ను ఏర్పాటు చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి బీఆర్ఎస్ ఆరోపణలు చేసినా పెద్దగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు.
Also Read : ఏపీలో ఆమ్రపాలి కి సంచలన బాధ్యతలు..?
దీనికి స్వయంగా కేంద్ర రక్షణ మంత్రి వచ్చి… శంకుస్థాపన చేసి రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసారు. దీనితో చాలా మంది విస్తుపోయారు. బిజెపిని ఏ అంశంలో బుట్టలో వేయోచ్చో రేవంత్ కు బాగా అర్ధమైందని, అందుకే రక్షణ వ్యవస్థ విషయంలో ముందు అడుగు వేసారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రేవంత్ రెడ్డి కాన్వాయ్… టెన్ జన్ పత్ కంటే ముందు కేంద్ర మంత్రుల ఇళ్ళ వద్ద చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ అవుతోంది. బిజెపితో కెసిఆర్ కూడా అప్పట్లో ఈ రేంజ్ లో సావాసం చేయలేకపోయారు.
ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గత పదేళ్ళలో కేంద్రంతో ఈ రేంజ్ లో స్నేహం చేయడం విడ్డూరమే. అందుకే పాలన పరంగా కూడా రేవంత్ కు పెద్దగా ఇబ్బందులు ఉండటం లేదు. అప్పట్లో కెసిఆర్ కు గవర్నర్ నరసింహన్ అండ ఉండేది. కానీ రేవంత్ కు ఢిల్లీలో లాబియింగ్ చేసే వాళ్ళు లేరు. కాని హవా మాత్రం నడుస్తోంది. దీనితో ఇప్పుడు రేవంత్ ను ఎలా టార్గెట్ చేయాలో అర్ధం కాక బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏ కోణంలో కూడా రేవంత్ పై బిజెపి ఈగ వాలనీయకపోవడంతో కేటిఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇక ఉండలేక రేవంత్ ఏ పార్టీ ముఖ్యమంత్రి అంటూ ప్రశ్నించారు బుధవారం. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడాలి.