వచ్చేది జగన్ ప్రభుత్వమే.. మళ్లీ వైసీపీ గెలుస్తుంది. ఇదే ఆ పార్టీ నేతల ధీమ. జగన్ మళ్లీ సీఎం అవుతారనేది కార్యకర్తల నమ్మకం. అందుకే ఇప్పటి నుంచే అధినేత దృష్టిలో పడేందుకు వైసీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జగన్‌కు ఏం చేస్తే నచ్చుతుందో అదే పని చేస్తున్నారు. జగన్‌కు దగ్గరయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. దాడులకు తెగబడుతున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అయితే ఇంత ధైర్యం రావడానికి కారణమేమిటీ.. వైసీపీ సైకోలు ఇలా రెచ్చిపోవడానికి కారణాలేమిటీ.. అంటే.. వినిపించే ఒకే సమాధానం.. తెలుగుదేశం పార్టీ. కూటమి సర్కార్‌లో ఒకరిద్దరు మంత్రులు, నాయకులు తప్ప.. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్న వారే లేరు. బ్లూ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సరిగ్గా అడ్డుకోలేక పోతున్నారు. ఇదే వైసీపీ నేతలకు అలుసుగా మారింది.
Also Read : వైసీపీకి జీవం పోస్తున్న టీడీపీ నేతలు.. ఇలా అయితే ఎలా..?
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్టు చేశారా.. అంటే అవుననే అంటారు అంతా.. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదనేది వాస్తవం. నిజానికి గోరంట్ల మాధవ్ స్వయంగా అరెస్ట్ అయ్యారు. అంతే తప్ప.. ఆయనను పోలీసులు అరెస్టు చేయలేదు. అదేంటి అంటే.. లోతుగా పరిశీలిస్తే.. అదే నిజం కూడా. పెద్ద ప్లాన్‌తోనే గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారనే విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్. అదేలా అంటే.. గోరంట్ల మాధవ్ నోటి దూల గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు గోరంట్ల మాధవ్ పేరు చుట్టూ వివాదాలే. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌తో మాధవ్ వెలుగులోకి వచ్చాడు. పోలీసు ఉద్యోగం చేస్తున్న మాధవ్.. నాడు పోలీసులపై జేసీ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. దీంతో గోరంట్ల మాధవ్ పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగింది. చివరికి హిందూపురం ఎంపీ టికెట్ సాధించే వరకు వెళ్లింది.
Also Read : వాళ్ళను యాక్టీవ్ చేసిన జగన్.. కూటమి కంట్రోల్ చేస్తుందా..?
గోరంట్ల మాధవ్ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా తనదైన శైలిలోనే రెచ్చిపోయారు. కియా కార్ల కంపెనీ యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ బెదిరించారు. అయితే ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తడంతో… అలా కాదు.. అలా జరగలేదు అంటూ కవర్ చేసుకున్నారు. ఇక ఎంపీగా హిందూపురం నియోజకవర్గానికి ఏం చేశావంటే.. సున్నా అనే సమాధానమే వస్తుంది. కానీ మీడియాలో కనిపించేందుకు ప్రతిరోజు తాపత్రయ పడ్డారు. చివరికి పార్లమెంట్‌లో పొగ బాంబు దాడి జరిగితే.. చేసిన వ్యక్తిని అందరూ పట్టుకున్నారు. కానీ చివర్లో గోరంట్ల రెండు బెంచీలు ఎక్కి దూకుతున్న వీడియో బయటకు రావడంతో.. నేనే పట్టుకున్నా.. నేనే పట్టుకున్నా.. పోలీస్ ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను చేసిన సాహసాల వల్లే.. నేను బాంబును లెక్క చేయలేదు అంటూ ఎలివేషన్ ఇచ్చుకున్నారు. ఇక గోరంట్ల మాధవ్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది.. న్యూడ్ వీడియో కాల్. ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. అయితే నేను కాదు నేను కాదు.. అంటూ గగ్గొలు పెట్టారు. పైగా ఆ వీడియో విషయంలో టీడీపీ నేత చింతకాయల విజయ్‌పై కేసు కూడా పెట్టారు.
Also Read : సొంత కార్యకర్తపై టిడిపి కఠిన చర్యలు.. ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు?
ఇక రెండు రోజులుగా గోరంట్ల మాధవ్ ఓ పెద్ద గేమ్ ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. మీసం మెలేసి విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దుర్భాషలాడితే నాలుక చీరేస్తానంటూ హెచ్చరించి.. 2019 ఎన్నికల్లో ఎంపీగా ఛాన్స్ కొట్టేసిన గోరంట్ల మాధవ్.. 2024 ఎన్నికల్లో కనీసం సీటు కూడా తెచ్చుకోలేదు. ఎమ్మెల్యేగా టికెట్ కోసం నానా పాట్లు పడుతున్న మాధవ్.. వైసీపీ అధినేత జగన్ దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు. జగన్ దృష్టిలో పడాలంటే.. టీడీపీ నేతలను బూతులు తిట్టాలి, దాడులు చేయాలనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు.అందుకే మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. పోలీసు కస్టడీలో ఉన్న ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై బహిరంగంగానే దాడికి తెగబడ్డాడు. చివరికి విధి నిర్వహణకు అడ్డుపడిన కేసులో గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read : కసిరెడ్డిని దేశం దాటించిన ఐపిఎస్
ఇక్కడే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు కిరణ్ ఏ మార్గంలో వస్తున్నాడో… ఏ వాహనంలో ఉన్నాడే అనే విషయం మాధవ్‌కు ఎలా తెలుసు.. పోలీసు వాహనంలో ఉన్న కిరణ్‌ను బయటకు లాగి మరీ దాడి ఎలా చేశారు.. గోరంట్ల మాధవ్ దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు.. ఇవే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరెస్టు అయితే పార్టీ అధినేత దృష్టిలో పడతాం.. అలాగే మీడియా కూడా బాగా ఫోకస్ చేస్తుందనేది మాధవ్ ప్లాన్. అందుకే ఇలా నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం.. దాడులు చేయడం అనేది కూడా గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పక్కా స్కెచ్‌తోనే గోరంట్ల మాధవ్ అడుగులు వేస్తున్నాడని.. టార్గెట్ ఎమ్మెల్యే టికెట్ సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. అనుచిత వ్యాఖ్యలకు చేస్తున్నట్లు తెలుస్తోంది.




