Friday, September 12, 2025 10:41 PM
Friday, September 12, 2025 10:41 PM
roots

జగన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిన షర్మిల…!

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మధ్య ఆస్తి తగదాలే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. 2019 ఎన్నికల వరకు కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలిగిన జగన్… గెలిచిన తర్వాత ఒక్కసారిగా మారిపోయారు. షర్మిల విషయంలో జగన్ అనుసరించిన వ్యూహమే ఇప్పుడు ఆయనకు శాపంగా మారిందనేది వాస్తవం. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇక 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపైన, లోకేష్‌ పైన షర్మిల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

చివరికి మీమర్స్ కూడా టిక్ టాక్ వీడియోలు చేసి వైరల్ చేశారు. అయితే ఎన్నికల్లో గెలుపు తర్వాత జగన్ వైఖరిలో మార్పు వచ్చింది. చివరికి ఆస్తి పంపకాల విషయం జగన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఆస్తి వివాదం రెండు మూడేళ్లుగా ఉన్నప్పటికీ… షర్మిల పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎన్‌సీఎల్‌టీ జగన్ పిటిషన్ దాఖలు వేసిన తర్వాత షర్మిల ఒక్కసారిగా భగ్గుమన్నారు. జగన్‌కు షర్మిల లేఖ రాయడం… తర్వాత షర్మిలకు మద్దతుగా వైఎస్ విజయలక్ష్మి కూడా లేఖ రాయడం… ఆ తర్వాత షర్మిల ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకోవడం… తెలుగు రాజకీయాల్లో ప్రత్యేక చరిత్ర కలిగిన వైఎస్ కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి.

అదే సమయంలో జగన్‌కు తీవ్ర నష్టం కూడా కలిగిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయాల్లో ఎన్టీఆర్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న నేతగా వైఎస్ఆర్‌కు పేరు. అదే క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని జగన్ జాగ్రత్తగా అడుగులు వేశారు. రాజన్న రాజ్యం తీసుకువస్తా అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే గెలిచిన తర్వాత కుటుంబ సభ్యులే జగన్‌కు ఎదురుతిరిగారు. బాబాయ్ హత్య కేసులో వివేకా కుమార్తె డా.సునీత రెడ్డి కోర్టుకు వెళ్లారు. జగన్‌పై పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆస్తి విషయంలో షర్మిలకు హ్యాండ్ ఇచ్చారు జగన్. షర్మిల పార్టీ పెట్టేలా ప్రొత్సహించారు కూడా.

Also Read : మూడో చాప్టర్ లో ఉన్న నాయకులు వీళ్లేనా…?

తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల… చివరికి సరిగ్గా ఎన్నికల సమయంలో అన్నపైన పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగారు. ఇక ఆస్తి పంపకాల విషయంలో షర్మిల, విజయలక్ష్మి ఏకమవ్వడంతో… వారిద్దరు జగన్‌కు ఆగర్భ శత్రువుల్లా మారిపోయారు. వాస్తవానికి ఆస్తుల వివాదం అయితే ఇంట్లో కుటుంబ పెద్దల మధ్య చర్చించుకుంటే సరిపోతుంది. కానీ అవి రచ్చకెక్కడంతో… జగన్ పరువు ప్రస్తుతం పూర్తిగా పోయింది. భవిష్యత్తులో షర్మిలతో రాజీ కుదుర్చుకున్నప్పటికీ… ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మాత్రం జగన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయనే చెప్పాలి.

ఇప్పటికే చెల్లిని, తల్లిని మోసం చేసిన వ్యక్తిగా జగన్‌కు ముద్ర పడింది. మరోవైపు జగన్‌కు రక్తసంబంధం కంటే ఆస్తే ముఖ్యం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వైసీపీ అధినేతకు మానసికంగా పెద్ద ఎదురుదెబ్బ. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనుక పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ పెద్దల అండ ఉందనే మాట బహిరంగ రహస్యం. అందుకే ఐదేళ్ల పాటు కేంద్రాన్ని జగన్ ఒక్కమాట కూడా అనలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఎన్డీయేలో చంద్రబాబు కూడా భాగస్వామి. పైగా ఎన్టీయే సర్కార్‌కు చంద్రబాబు అవసరం చాలా ఉంది. దీంతో జగన్‌కు సహకరించే పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కూడా జగన్ చేరే పరిస్థితి లేదు. ఇందుకు కారణం… ఏపీలో కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నది సోదరి షర్మిల. అందుకే ఢిల్లీలో చేసిన ధర్నాకు కాంగ్రెస్ నేతలు మద్దతివ్వలేదు. ఇది రాజకీయంగా జగన్‌కు గట్టి ఎదురుదెబ్బ కూడా. కాబట్టి ఆస్తుల పంపకాల వివాదానికి జగన్ సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికితేనే బెటర్ అనే మాట ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్