సార్ సీఎం గారు… మమ్మల్ని ఆదుకోండి ప్లీజ్ అంటున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి కావస్తుంది. గతానికి ఇప్పటికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ప్రతి నెల ఠంఛన్‌గా ఒకటో తేదీన ఇప్పుడు జీతం తీసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. వాస్తవానికి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం… తొలి ఏడాది మాత్రమే ఉద్యోగులు, పింఛనర్లకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనం ఇచ్చింది. ఇక రెండో ఏడాది నుంచి సంక్షేమ పథకాల అమలుకే పెద్ద పీట వేసిన జగన్ సర్కార్… అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో ఆదాయం శూన్యమవడంతో… జీతాలు చెల్లించడానికి కూడా అప్పులు చేసేసింది. ప్రతి శుక్రవారం ఇండెంట్ పెట్టడం.. మంగళవారం అప్పులు తెచ్చుకోవడం… ఇదే రోటిన్‌గా సాగింది.
దీంతో అప్పు డబ్బులు జమ చేసిన తర్వాత ఉద్యోగులకు జీతాలు చెల్లించారు. అది పదో తేదీ అయినా కావచ్చు… ఆ తర్వాతైనా కావచ్చు. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న లోన్ తాలుకా వాయిదాలు సకాలంలో చెల్లించలేక చాలా మంది ఉద్యోగులు డిఫాల్టర్‌గా మారిపోయారు కూడా. ఇక ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం ఒకటో తేదీనే వస్తుంది. దీంతో లోన్ వాయిదాలు కూడా సకాలంలోనే చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడే ఉద్యోగులకు ఓ పెద్ద అడ్డంకి ఎదురవుతోంది. ప్రస్తుతం చాలా మంది పిల్లల చదువులు, గృహ అవసరాల కోసం మరోసారి బ్యాంకుల వద్దకు లోన్ కోసం వెళ్లిన సందర్భంలో విచిత్రమైన సమస్య ఎదురైంది. డిఫాల్టర్ కావడంతో కొత్త అప్పు ఇచ్చేది లేదని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పేస్తున్నారు.
Read Also : టీటీడీ బోర్డు జాబితా ఇదేనా….!
ఓ వైపు చెప్పుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ… డిఫాల్టర్ కావడంతో బ్యాంకుల్లో అప్పు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. దీంతో పలువురు ఉద్యోగులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌కు, మంత్రి లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా తమ సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.