విజయవాడలో హైడ్రా తరహా వ్యవస్థ పురుడు పోసుకుంటుందా…? త్వరలోనే భారీ కూల్చివేతలు ఉండే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఇటీవల బుడమేరు దెబ్బకు విజయవాడ విలవిలలాడిపోయింది. మూడు గండ్లు విజయవాడలో దాదాపు 30 శాతం ప్రాంతాన్ని నీళ్ళల్లో ముంచాయి. దాదాపు వారం రోజుల పాటు ప్రజలు నానా కష్టాలు పడ్డారు. దీనితో ప్రభుత్వం ఇప్పుడు బుడమేరు వాగు కట్టపై కట్టిన అక్రమ కట్టడాల మీద ఫోకస్ పెట్టింది. త్వరలోనే అక్రమ కట్టడాలని కూల్చాలని భావిస్తుంది.
వస్తున్న వార్తల ప్రకారం… త్వరలోనే ఆపరేషన్ బుడమేరు ఉండే అవకాశం ఉంది. విజయవాడ నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపడుతోంది ప్రభుత్వం. తాజాగా యాక్షన్ ప్లాన్ కార్యాచరణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీతోపాటు నీటి పారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు కూడా పాల్గొనడంతో ఆపరేషన్ బుడమేరు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Also : దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న తిరుమల లడ్డు వ్యవహారం
భవిష్యత్లో బుడమేరు నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని సిఎం చంద్రబాబు సూచించిన నేపధ్యంలో బుడమేరకు వరదలు రావడానికి ప్రధాన కారణం ఏంటి..? భవిష్యత్ లో సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై దృష్టి పెట్టారు. బుడమేరు వాగు పరివాహక ప్రాంతంలో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆక్రమణలను తొలగింపునకు ప్రభుత్వం త్వరలోనే రంగం సిద్దం చేస్తోంది. ఇక అక్కడ నివాసం ఉండే వాళ్లకు ప్రభుత్వమే పునరావాసం కల్పిస్తుందా లేదా అనేది చూడాలి.