“పదవి, అధికారం శాశ్వితం కావని తెలుసుకోండి….” అంటూ ప్రతీరోజూ సిఎం చంద్రబాబు నాయుడుని, పోలీస్ అధికారులను హెచ్చరించే జగన్మోహన్ రెడ్డి, ఈ విషయం అధికారంలో ఉన్నప్పుడు గ్రహించలేదు. గ్రహించి ఉంటే అంత పైశాచికంగా ప్రవర్తించేవారు కారు… వైసీపి నేతలు అంత అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడకుండా కట్టడి చేసి ఉండేవారు. కానీ మనమే శాశ్వతంగా అధికారంలో ఉంటామనే గుడ్డి నమ్మకం, ధీమాతో తప్పు మీద తప్పు చేశారు. ఆ వేల తప్పుల జాబితాలో వివేకా హత్య కేసు కూడా ఒకటి.
అక్రమాస్తుల కేసులని ఏళ్ళ తరబడి సాగదీస్తున్న అనుభవంతో వివేకా హత్య కేసుని సాగదీసేయవచ్చని అనుకొని దాంతో కూడా 5 ఏళ్ళు ఆటలాడుకోవడం మరో పెద్ద తప్పు. ఆ గుడ్డి ధీమాతోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్, బాధితులుగా ఉన్న సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దంపతులను నిందితులుగా చూపేందుకు ప్రయత్నించిన్నట్లు అనుకోవచ్చు.
Read Also : కూటమి ఎమ్మెల్యేలతో బాబు కీలక భేటీ
నిజానికి జగన్ చేతిలో సర్వాధికారాలు, పరపతి అన్నీ ఉన్నప్పుడు ఈ కేసు విచారణని త్వరగా ముగించి బయటపడే ప్రయత్నం చేయకుండా ఈ హత్యానేరాన్ని కూడా ఏదో విదంగా చంద్రబాబు నాయుడు మెడలో వేసేద్దామనుకుని.. కేసుని సాగదీసుకుంటూ పోయారు. ఇప్పుడు జగన్ పదవి, అధికారం రెండూ కోల్పోయారు. జగన్ అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు కూడా.

సునీత దంపతులు మంగళవారం ఆయనని కలిసి ఈ కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడాలని కోరారు. సిఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ముందుగా ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ అధికారులు, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వైసీపి నేతల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత వైసీపి భాషలో ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం’ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడివస్తే సీబీఐలో మళ్ళీ చలనం రావచ్చు. వస్తే మొదట అవినాష్ రెడ్డికి ఆహ్వానం రావచ్చు. ఆయన జైలుకి వెళ్ళాల్సివస్తే ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. కనుక వెంట ఎవరిని తీసుకువెళతారో అందరికీ తెలుసు. కనుక సునీతా దంపతులు, సిఎం చంద్రబాబు నాయుడు భేటీని మొక్కుబడి భేటీ అనుకోలేము. వారి భేటీతో వైసీపికి మరో అలారం గంట మోగిన్నట్లే భావించవచ్చు.