తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడినట్లు అందరూ ఊహించిన్నప్పటికీ స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా మంది నమ్మలేకపోయారు. అన్ని రకాలుగా తిరుగులేని నేతగా ఎదిగిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గద్దె దించడం అంత సులభంగా సాధ్యం అవుతుందని ఊహించలేకపోయారు. ఈ ఫలితాలు సహజంగానే పొరుగున ఉన్న, మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా వరుసగా మంత్రులతో సహా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చడం, పెద్దఎత్తున సిట్టింగ్ ఎమ్యెల్యేలకు సీట్లు ఇవ్వకపోవచ్చనే సంకేతం ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పక్షంలో గందరగోళంకు దారితీస్తున్నారు.
`వై నాట్ 175′ అంటూ తనకు తిరుగులేదని చెప్పుకొంటున్న వైఎస్ జగన్ ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు పట్ల ఆందోళన చెందుతున్నట్లు స్పష్టం అవుతుంది. వైఎస్ జగన్ కు సన్నిహితులుగా భావిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వంటి వారే `అభద్రత’కు గురవుతూ ఉండడంతో వైసిపిలో నాయకత్వం పట్ల `విశ్వాసం’ సన్నగిల్లుతున్న సూచనలు వెల్లడవుతున్నాయి.
మరోవంక, తెలంగాణలో ప్రభుత్వ మార్పు సంకేతం ఏపీలో 2024లో జరిగి అసెంబ్లీ ఎన్నికలకు ఒక సూచన అని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నారు. అయితే, కేవలం ప్రభుత్వం వ్యతిరేకతతో గెలుపొందడం సాధ్యం కాదని మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమి నుండి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే `కఠిన నిర్ణయాలు’ తప్పవనే సంకేతం ఇచ్చారు.
‘సింహం సింగిల్‌గా వస్తుంది’, ‘వై నాట్ 175’ అంటూ వైయస్ జగన్ మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఒంటెద్దు పోకడలతోనే తెలంగాణాలో కేసీఆర్ తప్పటడుగు వేసిన్నట్లు వెల్లడైంది. తెలంగాణాలో కాంగ్రెస్ బిఆర్ఎస్ వ్యతిరేక శక్తులు అన్నింటిని తనతో కలుపుకుపోయే ప్రయత్నం చేసింది. 2019లో ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కూడా అటువంటి ప్రయత్నం చేసి 151 సీట్లు పొందారు. ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ఉద్యోగులు, మేధావులు, యువకులు, బలహీన వర్గాలు వంటి వారి మద్దతును కూడదీసుకున్నారు.
రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్న కోదండరాంరెడ్డి వంటి మేధావులతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, ఎస్సైలు, ఎస్టీలు, ఇతర వర్గాల మద్దతు సమీకరించుకోలేకపోయారు. ఆ విధంగా ఓ విధంగా కేసీఆర్ ను ఒంటరివానిగా చేయగలిగారు. ఇప్పుడు కేసీఆర్ మాదిరిగా జగన్ కూడా ఏపీలో `ఒంటరి పోరాటం’ చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత పెద్దఎత్తున కనపడినా కాంగ్రెస్ తెలంగాణాలో మాదిరిగా ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేయక ఓటమి చెందింది.
పేదలకు తాము పెద్దఎత్తున జరుగుపుతున్న `నగదు పంపిణి’ (బటన్ నొక్కుడు) పథకాలే తమను ఆదుకోటాయనే భరోసా సహితం ఎన్నికలప్పుడు నిలబడదని స్పష్టం అవుతుంది. సీఎం జగన్ తన మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఈ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్ ధీమాగా కనిపిస్తున్నారు.
అయితే, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ అక్కడ ఓడిపోయిందనేది ఇక్కడ గమనార్హం. వినూత్న పథకాలతో దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న కేసీఆర్ కూడా తెలంగాణలో గట్టెక్కలేకపోయారు. మరోవంక, ఈ పధకాల లబ్దికారులు అందించే మద్దతు కన్నా ఈ పధకాల అమలులో జరిగిన అక్రమాలు, అవినీతి కారణంగా దూరమైనా ప్రజల వ్యతిరేకత కేసీఆర్ కు ముప్పుగా పరిణమించింది. ఆయా పధకాలు అమలు జరిగిన తీరు కొన్ని వర్గాల ప్రజలను దూరం చేసింది. పైగా, ఈ పధకాల అమలులో పార్టీ స్థానిక నాయకుల ప్రమేయం లేక వలంటీర్ల పెత్తనం పెరగడంతో స్థానికంగా అధికార పార్టీ నాయకత్వంలోనే అలసత్వం నెలకొంది.
మరోవంక, 2019లో వైఎస్సార్సీపీకి, టీడీపీల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 10 శాతం ఉంది. ఇంత వ్యత్యాసాన్ని దాటడం ప్రతిపక్షాలకు అసాధ్యమని ఇన్నాళ్లు జగన్ లో ధీమా వ్యక్తం అవుతూ వస్తున్నది. తెలంగాణాలో కేసీఆర్ సహితం ఇటువంటి ధీమాతోనే ఉంటూ వచ్చారు. అయితే, 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 18.5 శాతం ఓట్ల వ్యత్యాసాన్ని పూడ్చుకోవడమే కాకుండా, మరో రెండు శాతం అధిక ఓట్లు సాధించి ఏకంగా అధికారాన్నే కైవసం చేసుకోవడం ఒక విధంగా విస్మయకరమే. ఏవిధంగా చూసుకున్నా ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ గత ఎన్నికల ఓట్లశాతాన్ని కాపాడుకొనే అవకాశాలు కనబడటం లేదు.
టిడిపి, జనసేన చేతులు కలపడంతో 10 శాతం వ్యత్యాసాన్ని అధిగమించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఏపీలో సహితం ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏమేరకు కలుపుకుపోగలరన్న అంశంపై టీడీపీ, జనసేన విజయం ఆధారపడుతుంది.