ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వైసీపీ లో అంతర్మధనం మొదలైంది. రాజకీయాలలో ఆత్మహత్యలే కాని, హత్యలుండవు అనే వాదనకు అధికార పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే తారాస్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. దానిని సరిదిద్దుకునే అవకాశం సైతం లేకపోవటంతో ఆ పార్టీ అధినాయకత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. వైసీపీ
పార్టీ, ప్రభుత్వం, దాని అధినేత పైన వున్న ప్రజా వ్యతిరేకతను తెలివిగా శాసనసభ్యుల వైపు మరల్చింది. దానిలో భాగంగానే వివిధ నియోజకవర్గాలలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే నెపంతో ‘జంబ్లింగ్’ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 82 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు స్థాన చలనం లేదా టిక్కెట్ కేటాయించకుండా మొండిచేయి చూపాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చింది. తొలి దశలో 11 చోట్ల ఈ ప్రక్రియకు ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంలోనే ఆ పార్టీ యోచన బెడిసికొట్టిన సూచనలు కన్పిస్తున్నాయి. నియోజకవర్గాలను మార్చిన వారిలో ఎక్కువగా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారే వుండటంతో ఆ పార్టీ ఇప్పటివరకూ చెప్పుకుంటూ వస్తున్న సామాజిక న్యాయం అనే వాదనకు తిలోదకాలు ఇచ్చినట్టు అయింది. ఆయా వర్గాల నుంచి తొలిసారి ధిక్కారస్వరం వినిపిస్తోంది.
రేపల్లె నియోజకవర్గంలో ఇప్పటి వరకు మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పార్టీ ఇంచార్జీగా వున్నారు. తాజా పరిణామాలలో ఆ నియోజకవర్గానికి డాక్టర్ ఈపూరి గణేశ్ ను ఇంచార్జీగా నియమించారు. దీంతో అక్కడి వైసీపీ క్యాడర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. రేపల్లె మునిసిపాలిటీ తో పాటు నియోజకవర్గ పరిధిలో వున్న అన్ని మండలాలలో ఛైర్మన్, కౌన్సిలర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ పదవులలో వున్న వారు దాదాపు 159 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వైసీపీలో పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితులలో ఒకరుగా గుర్తింపు పొందిన
మోపిదేవి వెంకటరమణ నియోజకవర్గంలోనే పరిస్తితి ఈ విధంగా వుంటే మిగిలిన చోట్ల ఇంకెలా వుంటుందో ఊహించుకోవచ్చు.
పార్టీ పెద్దలు చేసిన తప్పులకు తాము శిక్షలు అనుభవించాలా? అన్న వాదన స్థానచలనం పొందిన ఎమ్మేల్యేలు, వారి అనుచరుల నుంచి వినవస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. వివేకా హత్య కేసు, మూడు రాజధానులు, పోలవరం ప్రాజెక్ట్ ను గాలికి వదలివేయటం, ఇసుకదోపిడీ, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, మద్యం కుంభకోణాలు, విద్యుత్,
ఆర్టీసీ చార్జీల పెరుగుదల, నిత్యవసరాలు, పెట్రోలు, డీజీలు ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరగటం వంటి ఎన్నో అంశాలు ప్రజావ్యతిరేకతకు కారణం అయ్యాయి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించటం, కార్యకర్తలపై దౌర్జన్యాలు, వేధింపులు వంటి వాటికి లెక్కేలేదు. ఈ పరిణామాలలో ఏ ఒక్కదానికీ స్థానికంగా వుండే శాసనసభ్యులు బాధ్యులుగా వుండే అవకాశం లేదు., అటువంటప్పుడు వారిపై ప్రజావ్యతిరేకత వుండటానికి అవకాశం ఎక్కడుంటుంది. ఏ నియోజకవర్గంలోనూ కనీస స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగలేదు. స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం నిర్దేశించిన కార్పొరేషన్ ల పథకాలకు నిధుల కేటాయింపే లేదు. ఇవన్నీ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకతకు దోహదకారి అయ్యాయి.
ఎన్నికలు సమీపిస్తున్నందున వీటిని దిద్దుబాటు చేసుకునే అవకాశం, ఉద్దేశం అధికార పార్టీకి లేనట్టుగా కన్పిస్తున్నది. అందుకే ప్రజావ్యతిరేకతను తెలివిగా శాసనసభ్యుల వైపుకు మళ్లించి చేతులు దులుపుకున్నట్టు అవగతం అవుతోంది. అధినాయకత్వం ప్రదర్శించిన అతితెలివిని ఆ పార్టీ శ్రేణులే తిప్పికొట్టడంతో అధికార పార్టీకి దిక్కుతోచడం లేదు. వైసీపీ పరిస్తితి ప్రస్తుతం ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా వుంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ చర్యలు ఆ పార్టీ కి ఆత్మహత్యాసదృశ్యంగా పరిణమించాయి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.