ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరిన వేళ, అధికార కూటమి అగ్రనేతలు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఈరోజు కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం ఆసక్తిని రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న మున్సిపల్ రీ-నామినేషన్ల నిర్ణయం సహా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ప్రొటోకాల్స్ పక్కనపెట్టి సీఎం ఇంటికి జనసేనాని..!
ఎన్నికలు ఏవైనా సరే, కూటమిగా వంద శాతం విజయం సాధించడమే లక్ష్యంగా ఇరు పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఖరారుతో పాటు రాబోయే ప్రాదేశిక ఎన్నికలైన పరిషత్ ఎన్నికల్లో స్థానాల సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన సీట్ల రిజర్వేషన్ల సమస్యలు, స్థానిక నాయకుల మధ్య ఉన్న స్వల్ప విభేదాలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : వైసీపీ నేతలు ఇప్పుడైనా నామినేషన్లు వేస్తారా..?
ముఖ్యంగా కూటమి మిత్రధర్మాన్ని ఉల్లంఘిస్తూ రెబల్స్‌గా బరిలోకి దిగుతున్న స్వతంత్ర అభ్యర్థులు, అసంతృప్త నేతలను తక్షణమే బుజ్జగించాలని, మాట వినని వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా కూటమి పార్టీలుగా కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు ముగిసేలా చూడాలని హోం శాఖకు దిశా నిర్దేశం చేశారు. ఏది ఏమైనా బాబు-పవన్‌ల ఈ వరుస భేటీలు కూటమి శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతున్నాయి.


