విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్, డివిజన్ అభ్యర్థులను నడిపించేందుకు అవసరమైన ఎన్నికల ఖర్చులు భరించడం ఇప్పుడు పార్టీకి పెద్ద భారంగా మారింది. నగరంలో పార్టీ తరఫున ప్రచారం హోరెత్తుతున్నప్పటికీ, తెరవెనుక మాత్రం నిధుల కొరత నేతలను తీవ్రంగా వేధిస్తోందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Also Read : వైసీపీ నేతలకు రాచమర్యాదలు.. టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్..!
ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఒక్కరే నగరంలో వన్-మ్యాన్ షో నడిపిస్తూ, తన సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలను, ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు, సీనియర్ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం ఈ ఎన్నికల వ్యవహారాలకు, ఖర్చులకు పూర్తిగా దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు, వైసీపీ తరఫున మళ్లీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాయన భాగ్యలక్ష్మి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం.
Also Read : వైసీపీ నేతలు ఇప్పుడైనా నామినేషన్లు వేస్తారా..?
తనకున్న భూములకు సంబంధించిన లీగల్ సమస్యల వల్ల వాటిని అమ్ముకోలేక, ప్రచార ఖర్చులను భరించాల్సిందిగా ఆమె పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ప్రత్యర్థి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ బరిలో ఉండటంతో విజయవాడ మేయర్ స్థానానికి పోటీ రసవత్తరంగా మారింది. ఇలాంటి కీలకమైన సమయంలో వైసీపీ అగ్రనేతల మధ్య సమన్వయ లోపం, ఆర్థిక ఇబ్బందులు తోడవటం పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. దేవినేని అవినాష్ ఒక్కరే ఎంతవరకు ఈ భారాన్ని మోయగలరనేది ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది.


