ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కానీ ఏపీ విషయంలో బిజెపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. టిడిపి పొత్తు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇటు టిడిపి,అటు బిజెపి మైండ్ గేమ్ ఆడుతున్నాయి. దీంతో ఈ పొత్తుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. ఎవరికి వారే పట్టు వీడకపోవడంతో.. రోజులు కరుగుతున్నాయే తప్ప.. పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. మరోవైపు టిడిపి, జనసేన తొలి జాబితాను ప్రకటించాయి. మరో జాబితా ప్రకటనకు సిద్ధపడుతున్నాయి. ఇంతలో బిజెపి వస్తే సరి. లేకుంటే మాత్రం ఏపీలో పొత్తులు లేనట్టే.
నెల రోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు తన ప్రతిపాదనను తెలియజేశారు. చంద్రబాబు తిరిగి వచ్చేసారు. దాని గురించి మాట్లాడడం మానేశారు. అటు బిజెపి పెద్దల సైతం ఈ ప్రస్తావన తీసుకురాలేదు. చంద్రబాబు బృందం ఢిల్లీ వెళ్లడం గానీ.. బిజెపి జాతీయ బృందం ఏపీ రావడం గానీ జరగలేదు. మధ్యలో ఒప్పిస్తానన్న పవన్ కు ఇంతవరకు అపాయింట్మెంట్ లభించలేదు. ఇన్ని పరిణామాల నడుమ అసలు బిజెపితో పొత్తు ఉంటుందా? లేదా? అన్న అనుమానం బలంగా పెరుగుతోంది.
బిజెపికి కోపం రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. బిజెపికి నాలుగు పార్లమెంట్ స్థానాలు, నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు ఎల్లో మీడియా కథనాలు రాసింది. దీంతో బిజెపి ఆగ్రహం మరింత పెరిగింది. పొత్తుల్లో ప్రతిష్టంభనకు ఇదే కారణమైంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన ను చంద్రబాబు తన వైపు తిప్పుకున్నారు.కనీసం బిజెపితో సంప్రదించకుండా పవన్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు సైతం పవన్ ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని బిజెపి నేతలు అనుమానిస్తున్నారు. తమను కనీసం సంప్రదించకుండా పవన్ చంద్రబాబు వైపు వెళ్లడాన్ని తప్పు పడుతున్నారు. ఈ విషయంలో పవన్ కంటే చంద్రబాబు పైనే అనుమానిస్తున్నారు. ఇంకా కూటమి కట్టకుండానే ఇన్ని తరహా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు.. రేపు ఇంతకుమించి రాజకీయాలు చేస్తారన్నది బిజెపి అగ్రనేతల అనుమానం.
మరోవైపు తాను బిజెపి వద్దకు వెళితే వారి కోరికలను తీర్చాల్సి వస్తుందని.. అందుకే బిజెపి తన వద్దకు రావాలన్న ధోరణిలో చంద్రబాబు ఉన్నారు. అదే సమయంలో బిజెపి సైతం పట్టు బిగిస్తోంది. ఒంటరిగా మేనిఫెస్టో తయారీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఇది చంద్రబాబుపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే అటు బిజెపి, ఇటు టిడిపి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అవే పొత్తుల ప్రతిష్టంభనకు కారణం అవుతున్నాయి.




