అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా కరెన్సీ చరిత్రలో ఒక అరుదైన మరియు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా దేశం ఏర్పడి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న చారిత్రాత్మక స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని.. యూఎస్ మింట్ ప్రత్యేకంగా ఒక డాలర్ నాణేన్ని అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ నాణేనికి ఉన్న అత్యంత ప్రత్యేకత ఏమిటంటే, దీనిపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రించారు.
Also Read : రాజీనామా చేయండి.. కొండాకు ఖర్గే షాక్..!
అమెరికా చట్టాల ప్రకారం సాధారణంగా మరణించిన దేశ నేతల చిత్రాలను మాత్రమే కరెన్సీపై ముద్రిస్తారు. కానీ, ఒక దేశ అధ్యక్షుడు పదవిలో ఉంటూ, సజీవంగా ఉండగా ఆయన చిత్రంతో అధికారిక డాలర్ కాయిన్ విడుదల చేయడం వందేళ్ల అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. చివరిగా 1926లో అమెరికా 150వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అప్పటి అధ్యక్షుడు కాల్వీన్ కూలిడ్జ్ బొమ్మతో హాఫ్-డాలర్ కాయిన్ తెచ్చారు. ఈ సరికొత్త గోల్డ్-ఫినిష్ వన్ డాలర్ కాయిన్ డిజైన్‌ను పరిశీలిస్తే..
Also Read : భయం భయంగా జెన్ జీ.. పాపం యువత..!
నాణేనికి ఒకవైపు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారిక చిత్రంతో పాటు “LIBERTY”, “IN GOD WE TRUST” మరియు అమెరికా స్వాతంత్య్ర ప్రయాణాన్ని సూచించేలా “1776 ~ 2026” అనే అక్షరాలను స్పష్టంగా చెక్కారు. మరోవైపు అమెరికా అధికారిక రాజముద్ర మధ్యలో “250” అనే సంఖ్యను ప్రత్యేకంగా పొందుపరిచారు. ఈ కాయిన్ల తయారీకి ట్రంప్ తన మొదటి టర్మ్‌లో ఆమోదించిన ‘సర్క్యులేటింగ్ కలెక్టబుల్ కాయిన్ రీడిజైన్ యాక్ట్ 2020’ చట్టాన్ని ఉపయోగించుకుని, ప్రస్తుత ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఇది లీగల్ టెండర్ అయినప్పటికీ, ఇవి మార్కెట్ చలామణి కంటే ఎక్కువగా కలెక్టర్ల కోసమే తయారు చేసినట్లు తెలుస్తోంది.

