ఏపీలో 5 ప్రధాన ఆలయాలకు పాలకమండలిని ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు చైర్మన్‌లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఎప్పటి నుంచో బోర్డు ప్రకటనపై పార్టీ ముఖ్యనేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా కూడా ఇప్పటికీ ప్రత్యేక అధికారుల కనుసన్నల్లోనే ప్రధాన ఆలయాలు కొనసాగడంపై పార్టీ నేతల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు టీటీడీకి మాత్రమే పాలకమండలి నియమించారు.. మిగిలిన దేవస్థానాల వంతు ఎప్పుడు అనే ప్రశ్నలు కూడా బాగా వినిపించాయి.
Also Read : ఓటు చోరీపై రాహుల్ ఆరోపణల హైలెట్స్ ఇవే
వీటికి బ్రేక్ వేసిన కూటమి ప్రభుత్వం.. 5 ప్రధాన ఆలయాల పాలక మండలికి చైర్మన్‌లను నియమించింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా బీజేపీ నేత పోతుగుంట రమేశ్ నాయుడు, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా జనసేన నేత కొట్టె సాయి ప్రసాద్, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా వి.సురేంద్రబాబు (మణినాయుడు), విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్‌గా ముదునూరి వెంకట్రాజును ప్రభుత్వం నియమించింది.
వీరిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్‌గా కొట్టె సాయి ప్రసాద్ నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జనసేన పార్టీకి చెందిన సాయి ప్రసాద్ ఓ సామాన్య కార్యకర్త మాత్రమే. వైసీపీ పాలనలో నాటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సాయి ప్రసాద్‌పై నాటి సీఐ అంజు యాదవ్ దాడి చేశారు. అందరూ చూస్తుండగానే సాయి ప్రసాద్‌ను చెంప దెబ్బలు కొట్టారు. ఎందుకు ఇలా కొడుతున్నారని అడిగిన వారిపై కూడా సీఐ అంజు యాదవ్ దురుసుగానే ప్రవర్తించారు. సాయి ప్రసాద్‌ను అంజు యాదవ్ కొడుతున్న వీడియో అప్పట్లో పెద్ద దుమారం కూడా రేపింది. సీఐపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేసినా.. నాటి వైసీపీ ప్రభుత్వం మాత్రం.. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Also Read : బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం చేస్తే ఆయుష్షు తగ్గుతుందా? పరిశోధనలో సంచలనం
సాయి ప్రసాద్‌ను అంజు యాదవ్ కొట్టిన విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. హుటాహుటిన శ్రీకాళహస్తి చేరుకున్నారు. అక్కడ నుంచి సాయి ప్రసాద్‌ను వెంట బెట్టుకుని తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి సీఐ అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆ రోజు పోలీసులు కొట్టినా ప్రజాస్వామ్యయుతంగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన కొట్టే సాయిని పవన్ కళ్యాణ్ గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం నిలిచే కార్యకర్తలు, నాయకులను గుర్తించి తగిన బాధ్యతలు ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకొంటున్నారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు తిన్న చెంప దెబ్బ.. ఇప్పుడు అదే ఆలయంలో స్వామి వారి సేవలో పాల్గొనే భాగ్యం కలిగించిందంటున్నారు.