శ్రీవారి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం సులువుగా కలిగేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కీలక అంశాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం 70 వేల మంది పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఇక స్వామి వారికి చేసే వివిధ సేవల్లో పాల్గొనేందుకు భక్తులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
స్వామి వారికి నిత్యం జరిగే సేవల్లో పాల్గొనేందుకు భక్తులు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రధానంగా సుప్రభాత సేవ. ప్రతిరోజూ ఉదయం 3.45 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవతో పాటు అంగప్రదక్షిణ కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన సేవలు నిర్వహిస్తారు. ఇక ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరుమాఢ వీధుల్లో స్వామి వారి ఉత్సవ సేవ కొనసాగుతుంది. వీటితో పాటు అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేస్తారు.
Also Read : కేరళలో మరో వైరస్ అలజడి.. లక్షణాలు ఇవే
స్వామి వారిని దర్శించుకోవాలనే భక్తులకు టీటీడీ ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆన్ లైన్ ద్వారా 3 నెలల ముందే స్వామి వారి సేవలు, దర్శనం కోటా టికెట్లు విడుదల చేస్తారు. గతంలో నేరుగా ఆన్ లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అన్నట్లుగా సేవల టికెట్లు అందుబాటులో ఉండేవి. అయితే ఈ విధానంపై కొన్ని విమర్శలు రావడంతో.. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ విధానం అమలు చేస్తున్నారు. ఆన్ లైన్‌లో సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 3 రోజుల పాటు అవకాశం ఉంటుంది. మూడో రోజు మధ్యాహ్నం ఎలక్ట్రానిక్ విధానంలో డిప్ తీస్తారు. అలా వచ్చిన వారికి ఆన్ లైన్ పేమెంట్ లింక్ ద్వారా సేవ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
నవంబర్ నెల వరకు సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన సేవలకు మాత్రమే లక్కీ డిప్ అమలు చేశారు. అంగప్రదక్షిణ టికెట్లను విడిగా విడుదల చేశారు. ప్రతి రోజూ 750 టికెట్లు అందుబాటులో ఉంచారు. అయితే ఈ టికెట్లు విడుదల చేసిన నిమిషం గడువు లోపే అన్ని అయిపోతున్నాయి. దీంతో టీటీడీ విజ్ఞప్తులు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై సమీక్ష నిర్వహించిన అధికారులు.. ఇకపై అంగప్రదక్షిణ టికెట్లు కూడా లక్కీ డిప్ ద్వారానే కేటాయించాలని నిర్ణయించారు. శుక్రవారం మినహా ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాల్లో రోజుకు 750 టికెట్లు విడుదల చేస్తారు. శనివారం మాత్రం 500 అంగప్రదక్షిణ టికెట్లు కేటాయిస్తారు. అలాగే గతంలో ఒకసారి అంగప్రదక్షిణకు వచ్చిన భక్తుడికి మళ్లీ 90 రోజుల వరకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ సమయానికి 180 రోజులకు పెంచారు.
Also Read : రోడ్డు మీద విగ్రహం.. స్వామి చుట్టూ రాజకీయం..!
శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు మాత్రం ఫస్ట్ ఇన్.. ఫస్ట్ అవుట్ విధానంలోనే అందుబాటులో ఉంచుతున్నారు. డిసెంబర్ నెల కోటాకు సంబంధించి ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ విధానం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు.
ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ అర్జిత సేవ టికెట్లు విడుదల చేస్తారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్, దివ్యాంగులకు టికెట్లు విడుదల చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం రూ.300 దర్శనం టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి బుకింగ్ అందుబాటులోకి వస్తుంది. ఈ నెల 25న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అక్టోబర్ నెల కోటా టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.