ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ హాట్ టాపిక్. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లి, టీడీపీ నాయకులను, ముఖ్యంగా చంద్రబాబు కుటుంబ సభ్యులను అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడిన వంశీ.. 2024 లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ ఆయనపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక వంశీ విషయంలో పోలీసు వర్గాలు కూడా సీరియస్ గానే దర్యాప్తు చేస్తూ.. కేసులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
Also Read : దారిలోకి వచ్చిన ట్రంప్.. భారత్ కు అమెరికా ప్రతినిధులు..!
ఈ సమయంలో వంశీకి వైసీపీ అధిష్టానం కాస్త బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల వంశీ సతీమణి పంకజ శ్రీకి గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు ఇస్తామని వైసీపీ అధిష్టానం సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో వంశీ వెనకడుగు వేసినట్టు సమాచారం. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రస్తుతం రాజకీయాలపై ఏ విధమైన ఆసక్తి లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఏ పదవులు వద్దని, కేసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తామని చెప్పారట.
Also Read : మా బాస్ ఫ్యామిలీని ఇండియన్ ఆర్మీ ముక్కలు చేసింది.. ఉగ్రవాది సంచలనం..!
ప్రస్తుతానికి ఎవరికి అయినా ఆ బాధ్యతలు ఇచ్చి వారినే కొనసాగించవచ్చని స్పష్టం చేసారట. ఇక నియోజకవర్గ నాయకుల నుంచి కూడా తమకు ఏ విధమైన సహకారం లేదని కూడా చెప్పినట్టు గన్నవరం వైసీపీ వర్గాలు అంటున్నాయి. వంశీ బెయిల్ మీద ప్రస్తుతం గన్నవరంలోనే ఉన్నారు. అయినా సరే ఆయనను పరామర్శించేందుకు నాయకులు ఎవరూ వెళ్ళలేదు అని సమాచారం. ఇదే సమయంలో కబ్జా వ్యవహారాలు సైతం వంశీని ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయి. ఇలాంటి వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్న టైంలో తాను రాజకీయంగా ముందుకు వెళ్ళలేను అని చెప్పారట వంశీ.