సెకెండ్ ఛాన్స్ రాదనే భయంతో టీడీపీని అణిచివేయడానికి అడ్డదారిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుకొని పార్టీలో ముఖ్యనేతలపై తప్పుడు కేసులు పెట్టి వారి గొంతు నొక్కాలని చూశారు వైసీపీ బాస్. ఆయన మెప్పు కోసం చంద్రబాబుపై పెట్టిన పసలేని కేసులు కోర్టులో నిలబడవని సీఐడీ అధికారులకు అర్ధం కావడానికి ఎంతోకాలం పట్టేలేదు. దీంతో టీడీపీ నేత కిలారు రాజేశ్‌ను బెదిరించి, బాబుపై తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ బెదిరింపులకు లొంగని రాజేశ్, ఎదురు తిరగడంతో సీఐడీ ఛీఫ్ కథ అడ్డం తిరిగింది.
కిలారు రాజేశ్‌ను బెదిరించే వ్యవహారంలో అనేక తప్పులు చేశారు ఏపీ సీఐడీ అధికారులు. అడ్డదారిలో వెళ్తూ అడుగడునా ఆధారాలు వదిలేశారు. ఇప్పుడు ఆ తప్పులే వారి మెడకు చుట్టుకొంటున్నాయి. స్కిల్ కేసులో కిలారు రాజేశ్‌ను సాక్షిగా పిలిచామని కోర్టులో చెప్పారు పోలీసులు. సీఐడీ వెబ్సైట్లో మాత్రం ఆయన్ను నిందితుడిగా చూపించారు. అదేంటని అడిగితే పోరపాటైపోయింది.. వెబ్సైట్లో మార్పులు చేస్తామని కోర్టు ముందు లెంపలేసుకున్నారు.
హైదరాబాద్‌లో ఉంటున్న కిలారు రాజేశ్‌పై నిఘా పెట్టి.. రెక్కీ నిర్వహించింది ఏపీ ఇంటెలిజెన్స్. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఎవరి మీదా నిఘా పెట్టలేదని దబాయించారు అధికారులు. తనపై నిఘా గురించి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మరోసారి నాలుక మడతేసిన సీఐడీ ఛీఫ్, నిఘా విషయంలోనూ తప్పయిపోయిందని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. స్కిల్ కేసులో సాక్షిగా ఉన్న రాజేశ్‌పై లుక్ఔట్ నోటీసు జారీ చేసి మరోసారి అడ్డంగా బుక్కయ్యారు సీఐడీ సంజయ్ అండ్ టీమ్. హైకోర్టులో ఈ అంశాన్ని సవాల్ చేయడంతో, మరోసారి పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు జగన్ ప్రభుత్వ లాయర్.
సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్‌ను, సీఐడీ ఛీఫ్ సంజయ్‌తో కలిపి ఇంటెలిజెన్స్ హెడ్ పీఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేశారు. ఆ రోజు సీతారామాంజనేయులు అసలు సీఐడీ ఆఫీసుకే రాలేదని బుకాయించారు సీఐడీ ఛీఫ్. అలా అయితే ఆరోజు సీఐడీ ఛీఫ్ సంజయ్, నిఘా ఛీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, డీఐజీ కొల్లి రఘురామిరెడ్డికి సంబంధించిన కాల్ డేటా.. మొబైల్ లొకేషన్, సీఐడీ ఆఫీసులో సీసీటీవీ ఫుటేజ్‌ని సమర్పించేలా ఆదేశించాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు రాజేశ్.
సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయిన కేసులు పెడుతూ సీఐడీ ఫౌల్ గేమ్ ఆడుతుంటే.. పక్కా లా పాయింట్లు, తిరుగులేని లాజిక్, కాదనలేని రుజువులతో అధికారుల ఆట కట్టిస్తున్నారు కిలారు రాజేశ్. లోకేశ్ ప్లాన్, రాజేశ్ పక్కా ఆచరణతో జగన్ అండ్ టీమ్ డిఫెన్స్‌లో పడిపోయారు. తప్పుడు కేసులతో టీడీపీ లీడర్స్‌ని జైలుకు పంపాలనుకున్న వాళ్లే అసలైన కేసుల్లో ఇరుక్కొనే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. న్యాయం ఇంకా బతికే ఉందని అంటున్నారు పరిశీలకులు.