అరిచే కుక్క కరవదు… కరిచే కుక్క మొరగదు.. సైలెంట్‌గా పని చేసుకుంటూ పోవాలి తప్ప.. ఎందుకీ గోల.. రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ డైలాగ్ తెగ హల్ చల్ చేస్తోంది. కృష్ణా జిల్లా వైసీపీ సమావేశంలో తమ పార్టీ శ్రేణుల గోల భరించలేక మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు ఇవే హాట్ టాపిక్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు జగన్ వెళ్తున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0, ఒక్కొక్కడికి రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఈ ఫోటోలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి కూడా. దీంతో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తనదైన శైలిలోనే స్పందించారు. “గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం.. అన్నారా.. తప్పేముంది.” అంటూ జగన్ కూడా వాటిని సమర్థించారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
Als Read : అమరావతి ల్యాండ్ పూలింగ్ కూటమి కి లాభమా.. నష్టమా?
వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్.. చివరికి 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత ఆ పార్టీ నేతలంతా దాదాపు సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన అవినీతిని కూటమి ప్రభుత్వం బయటకు తీస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు సహా పలువురు కీలక నేతలు అరెస్టయ్యారు. దీంతో మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని వంటి నేతలతో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నేతల కూడా సైలెంట్ అయ్యారు. కొంతమంది నేతలైతే రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు కూడా. ఇక బాలినేని, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ వంటి ముఖ్య నేతలే జగన్‌కు గుడ్ బై చెప్పారు. దీంతో పార్టీ శ్రేణుల్లో భయం పొగొట్టడానికి జగన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులను బట్టలూడదీసి నిలబెడతా అని వార్నింగ్ ఇచ్చారు. అలాగే జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారని కూడా అన్నారు.
జగన్ పదే పదే ఇవే మాటలు చెప్పడంతో.. వైసీపీ అధికారంలోకి వస్తే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటూ వైసీపీ శ్రేణులు కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ పర్యటనలోనే పోలీసులపై రాళ్లు రువ్వటం, దాడులు చేయడం, చివరికి పోలీసు వాహనంపైకి ఎక్కేసి ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రప్పా రప్పా, తొక్కుతాం, నరుకుతాం అనే డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. వీటిపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగానే స్పందించారు. “రప్పా రప్పా నరుకుతాం అని చెప్పడం ఏమిటి.. అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్కు మొరగదు.. అనే సామెత మర్చిపోయారు. చేసే వాడు ఎప్పుడు చెప్పడు.. సైలెంట్‌గా చేయాలి తప్ప.. ఈ రప్పా రప్పా డైలాగులు ఎందుకు చెప్పు..” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తగిలినట్లున్నాయి.
Als Read : నిద్రించే సమయంలో ఎటువైపు తిరిగి పడుకోవాలి?
ఎన్నికల ప్రచారంలో నేను అది చేస్తా ఇది చేస్తా అని చంద్రబాబు పదే పదే చెప్తారు తప్ప.. చేయరు అనేది వైసీపీ నేతలు పదే పదే చెప్తున్న మాట. కానీ ఈసారి వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు అమలు చేశారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వెలువలా వస్తున్నాయి. అంటే ఎవరెన్ని మాటలు అంటున్నా సరే.. చంద్రబాబు మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు అనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. కానీ జగన్ మాత్రం.. అధికారంలోకి వస్తే.. నరుకుతాం, అరెస్టులు చేస్తాం, కేసులు పెడతాం, బట్టలూడదీస్తాం అని బెదిరిస్తున్నారు. వీటినే పేర్ని నాని తప్పుబట్టినట్లు తెలుస్తోంది. అరుపులు తప్ప.. చేసేది ఏం లేదు.. అనే ఉద్దేశ్యంతోనే పేర్ని నాని వ్యాఖ్యలున్నాయని జగన్ భావన. ఈ విషయంలో పార్టీ నేతలెవరూ పేర్ని నానికి మద్దతు ఇవ్వొద్దని జగన్ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే పేర్ని నానిపై టీడీపీ నేతలు కేసులు పెడుతున్నా కూడా.. కనీసం కృష్ణా జిల్లా వైసీపీ నేతలు కూడా ఆయనకు మద్దతుగా ఒక్క మాట కూడా అనటం లేదు. దీంతో ఎందుకు వచ్చిన తిప్పలని భావించిన పేర్ని నాని.. “నేను అలా అనలేదు.. నా మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారు.” అని కవరింగ్ చేసుకునేలా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి పాత సామెత చెప్పిన పేర్ని నాని.. నిజంగానే తమ అధినేతను ఉద్దేశించి అన్నారా.. అనే చర్చ ఇప్పుడు వైసీపీలో జోరుగా జరుగుతోంది.