ఏపీలో అధికారంలో ఉన్నది ఎవరూ… అంటే అందరీ చూపు వైసీపీ వైపే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలాగే ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు బయట తిరిగేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. మాచర్ల, తాడిపత్రి వంటి నియోజకవర్గాల్లో అయితే వరుస హత్యలే. టీడీపీ నేత, కార్యకర్త బయట కనిపిస్తే చాలు.. దాడి చేయడమే లక్ష్యం. అయితే ఈ అరాచకాలు ఓటుతో చెక్ పెట్టారు ఏపీ ఓటర్లు. కూటమి అధికారంలోకి వచ్చింది. సంతోషం.. అంతా బాగానే ఉంది కదా అంటున్నారు. కానీ ఐదేళ్ల పాటు అరాచకాలు సృష్టించిన వైసీపీ తిరిగి అధికారంలోకి రాకూడదు అన్నట్లుగా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. పరువు పోవడంతో.. వైసీపీ అధినేత జగన్ కూడా తన మకాం తాడేపల్లి నుంచి బెంగళూరు మార్చేశారు. కానీ పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితికి చేరుకున్న అనే అనుమానం వస్తోంది.
Also Read : అమరావతిలో కొత్త పోలీస్ స్టేషన్.. ఎందుకంటే..!
అవును.. నిజమే.. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు కేవలం 11. జగన్‌తో పదవులు అనుభవించిన వారిలో గెలిచింది ఎవరూ అంటే… కేవలం పెద్దిరెడ్డి మాత్రమే. మిగిలిన వారంతా భారీ తేడాతో ఓడిపోయారు. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం వరకు కేవలం 5 జిల్లాల్లో మాత్రమే వైసీపీ సభ్యులు గెలిచారు. మిగిలిన 8 జిల్లాల్లో కనీసం బోణీ కూడా కొట్టలేదు. ఇక వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమ ప్రాంతంలో కడపలో 3, కర్నూలులో 2, చిత్తూరు జిల్లాలో 2 స్థానాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అలాగే జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు కూడా టీడీపీ గెలుచుకుంది. కూటమికి భారీ మెజారిటీ ఇచ్చిన అనంత జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లా కూటమి నేతల తీరు చూస్తే మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవగా.. ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన సత్యకుమార్ యాదవ్‌కు మంత్రిపదవి దక్కింది. కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న పయ్యావుల కేశవ్‌తో పాటు మంత్రి సవిత కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read : మళ్ళీ మొదలైన మంచు రచ్చ
వైసీపీ అధికారం కోల్పోయి పది నెలలు కూడా కాకముందే మళ్లీ బలం పుంజుకుంటోంది. ఎన్నికల్లో పరిటాల సునీత రాప్తాడులో గెలిస్తే మీసం తీయించుకుంటా అంటూ ప్రగల్భాలు పలికిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొద్ది రోజులు మాత్రమే సైలెంట్‌గా ఉన్నారు. అయితే రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీతపై విమర్శలు చేసినా జిల్లాలో ఇతర నేతలు పెద్దగా స్పందించే పరిస్థితి లేదని గుర్తించిన తోపుదుర్తి.. నెమ్మదిగా స్వరం పెంచారు. చివరికి పెనుగొండ తహసీల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన తోపుదుర్తి.. డీఎస్పీపై పరుష పదజాలంతో రెచ్చిపోయారు. అందరి ముందే పోలీసులను తిట్టేశారు తోపుదుర్తి. ఇదంతా మార్చి 29న జరిగింది. ఇంత జరిగినా జిల్లాకు చెందిన ఒక్క టీడీపీ నేత కూడా ఈ విషయంపై కనీసం స్పందించలేదు. తోపుదుర్తితో పాటు మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్ కూడా దూకుడుగానే వ్యవహరించారు. అయినా సరే… ఆమెపై గెలిచిన మంత్రి సవిత కూడా కనీసం స్పందించలేదు.
Also Read : రోహిత్ ను వెంటాడుతున్న “బౌల్డ్” భయం
ఇక వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ తగాదాలతో హత్యకు గురైతే… దానికి రాజకీయ రంగు పులిమారు. పరిటాల కుటుంబమే ఈ హత్య చేయించినట్లు ఆరోపించారు. ఇది రాజకీయ హత్య అని ప్రచారం చేశారు. దీనిపై ఏకంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హెలికాఫ్టర్ వేసుకుని వచ్చి మరీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే జిల్లాలో పర్యటనకు వచ్చి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇంత జరిగినా సరే… టీడీపీ నేతలు కనీసం ఒక్కరు కూడా బయటకు రాలేదు. ఎందుకంటే.. ఇది రాప్తాడులో కదా జరిగింది.. మాకేం సంబంధం అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్ కు ఆహ్వానం లేదా.. సోషల్ మీడియా చేతికి కొబ్బరి చిప్ప
రాప్తాడులో జరిగింది కాబట్టి.. దీనికి పరిటాల సునీత మాత్రమే కౌంటర్ ఇవ్వాలా.. అలా అయితే ఏ నియోజకవర్గంలో జరిగితే.. ఆ నియోజకవర్గానికి చెందిన నేత మాత్రమే స్పందించాలా… మిగిలిన వారికి జగన్‌ను అడ్డుకునే బాధ్యత లేదా.. టీడీపీని మరింత బలోపేతం చేయాలని ఎందుకు అనుకోవటం లేదు.. వాస్తవానికి రాప్తాడులో జగన్ పర్యటిస్తే.. దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలపై కూడా పడుతుంది. మరి ఇంత చిన్న లాజిక్కు టీడీపీ నేతలు ఎలా మిస్ అయ్యారు. కుటుంబంలో వంద విభేదాలు ఉండవచ్చు.. కానీ ఎవరైనా బయటవారి కుటుంబ సభ్యులపై దాడికి యత్నిస్తే.. అంతా కలిసే అడ్డుకోవాలి. ఇదే సూత్రం రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. కానీ అనంత టీడీపీ నేతల తీరు చూస్తే మాత్రం ఆశ్చర్యమేస్తోంది. ఎవరి మీదకు దాడికి వస్తే.. వాళ్లే ఎదుర్కోవాలి తప్ప.. జిల్లాలో మిగిలిన నాయకత్వం స్పందించకూడదు అని నియమం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల క్యాడర్‌కు ఏ సందేశం పంపిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.
Also Read : జగన్ పై అనిత సంచలన కామెంట్స్.. వాట్సాప్ మెసేజ్ లపై కీలక వ్యాఖ్యలు
ఇక వైసీపీ అధినేత జగన్ గేమ్ ప్లాన్ చూస్తే.. బలమైన అనుచరులున్న పరిటాల కుటుంబాన్ని ముందుగా టార్గెట్ చేశారు. వారి నుంచి వచ్చే ప్రతిఘటన.. పరిటాల కుటుంబానికి ఇతర నేతల మద్దతు వంటి అంశాలను బేరీజు వేసుకుని అనంత జిల్లాలోనే కాకుండా.. రాయలసీమలోనే పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇదే పార్టీ సామాన్య కార్యకర్తలో భయం కలిగిస్తోంది. సహచర ఎమ్మెల్యేకు కష్టం వస్తే.. కనీసం స్పందించని నేతలు.. కార్యకర్త గురించి పట్టించుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. స్పందించడం తర్వాత.. కనీసం గుర్తిస్తారా.. అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌పైన, వైసీపీ నేతలపైన పోరాటం కేవలం ఒక నేతకే పరిమితం కాకూడదని.. అది పరిటాల కుటుంబం వ్యక్తిగత పోరు కాదంటున్నారు. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలపైన కూడా జగన్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నారు.