జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకి లాభమా.. నష్టమా.. ప్రస్తుతం ఇదే ప్రశ్న అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ తర్వాత ఈ ప్రశ్న బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ప్రతి టీడీపీ కార్యకర్త కూడా అసలు పొత్తు వల్ల ఎవరికి లాభం.. అని కూడా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి 2014 ఎన్నికల నాటికి జనసేన పార్టీకి కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే ఉన్నారు. ఆయన వెంట అభిమానులు తప్ప ఎవరూ లేరు. దీంతో 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. బయట నుంచే మద్దతు ఇస్తూ… ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కూడా పరిచయాలు పెంచుకున్నారు. ఆ తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ.. ప్రత్యక్ష పోరాటాలు చేశారు. దీంతో నెమ్మదిగా జనసేన పార్టీకి బలం పెరిగింది.
Also Read : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. వాళ్ళతో లింకులు ఉంటే అంతే..!
ఇక 2019 నాటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు పవన్. అయితే కేవలం అభిమానులను మాత్రమే నమ్ముకుంటే ఏమవుతుందో పవన్ గుర్తించారు. ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో జనసేన గెలిచింది. చివరికి పవన్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి రూట్ మార్చారు. నాటి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే… కేంద్ర ప్రభుత్వానికి బాగా దగ్గరయ్యారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు చేరువయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే… పొత్తు ఉంటుందని ముందుగానే పవన్ ప్రకటించారు. అసలు రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం జరగక ముందే… ఇప్పటంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో… వైసీపీని ఓడించాలంటే.. అందరూ కలిసి పోటీ చేయాలని పవన్ పిలుపిచ్చారు. దాంతో.. 2022 నుంచి ఏదో ఒక రూపంలో పొత్తుల ప్రస్తావన కొనసాగుతూనే ఉంది. పాకం ముదిరినట్లుగా.. 2023 సెప్టెంబర్‌లో చంద్రబాబు అరెస్టు నాటికి ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత… పొత్తు కొనసాగుతుందని ముందుగా ప్రకటించింది కూడా పవన్. కలిసి పోటీ చేస్తున్నాం.. గెలుస్తున్నాం అని పవన్ ప్రకటన చేశారు. బీజేపీని కూడా పొత్తుకు ఒప్పించిన పవన్.. కమలం పార్టీ కోసం కొన్ని సీట్లు కూడా త్యాగం చేశారు.
Also Read : రంగన్న శరీరంలో 20 నమూనాలు.. పోలీసులు కీలక విచారణ
టీడీపీ, బీజేపీ మద్దతుతో 2024 ఎన్నికల్లో జనసేన వంద శాతం విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో నలుగురు టీడీపీ నుంచి జనసేనలో చేరిన వారే ఉన్నారు. ఇక గెలిచిన తర్వాత జనసేనాని గేమ్ ప్లాన్ షురూ చేశారు. పార్టీని బిల్డ్ చేసుకునే ప్రక్రియపై దృష్టి పెట్టారు. అంతకు ముందు వరకు చంద్రబాబుపై విమర్శలు చేసిన వారినే జనసేనలో చేర్చుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఇప్పటికే 2 సొంతం చేసుకున్నారు. పైకి మాత్రం పొత్తు 15 ఏళ్లు కొనసాగుతుందని పవన్ చెబుతున్నప్పటికీ.. చాప కింద నీరులా పార్టీని విస్తరిస్తున్నారు. దీని వల్ల రాబోయే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు అడిగేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఇక తాజాగా పిఠాపురం సభలో మాత్రం 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నిలబెట్టామని చెప్పడం.. రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలకు పవన్ బీజం వేసినట్లు అయ్యింది. దీంతో రాబోయే ఎన్నికల్లో కూటమి మధ్య సఖ్యత ఉండటం కష్టంగానే కనిపిస్తోంది. అదే జరిగితే.. కోటి మంది సభ్యత్వాలున్న టీడీపీకి జనసేన వల్ల పెద్దగా నష్టం జరగదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




