శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతల్లో మరోసారి గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ నిర్వహించిన సమావేశానికి కీలక నేతలంతా డుమ్మా కొట్టారు. పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును వైసీపీ పెద్దలు నియమించారు. ఇప్పటికే విశాఖ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన కన్నబాబు… తాజాగా శ్రీకాకుళం జిల్లా నేతలతో కూడా సమన్వయ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి పార్టీలోని ముఖ్య నేతలే డుమ్మా కొట్టారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాల కారణంగా వైసీపీ నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక హాజరైన వారు కూడా.. ఏదో మొక్కుబడిగా సభలో కూర్చున్నారు తప్ప… పార్టీని గాడీలో పెట్టేందుకు ఎలాంటి సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేదు.
Also Read :చంద్రబాబు, లోకేష్ పేషీల చుట్టూ ప్రదక్షణలు
శ్రీకాకుళం జిల్లా అంటే చాలు ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ధర్మాన బ్రదర్స్. వైసీపీలో సీనియర్లుగా ఉన్న ధర్మాన సోదరులతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ప్రస్తుత ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్సీలు ఈ మీటింగ్‌కు రాలేదని అంతా సర్థిచెప్పుకున్నారు. అయితే వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావులు తమ తమ నియోజకవర్గాల్లో తీవ్ర వర్గ పోరుతో ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ప్రస్తుతం వైసీపీ టెక్కలి ఇంఛార్జ్‌గా ఉన్న పేరాడ తిలక్ కొనసాగుతున్నారు.
Also Read: అమ్మో వారెంట్.. వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు
వీరిద్దరి మధ్య అస్సలు సయోధ్య లేదు. ఇక ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కూడా వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ నర్తు రామారావుకు, జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయడం నర్తు రామారావుకు ఏ మాత్రం రుచించడం లేదు. ఇదే విషయం ఇప్పటికే ఎన్నోసార్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇచ్ఛాపురంలో నర్తు వర్సెస్ పిరియా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న సమన్వయ సమావేశానికి నర్తు రామారావుతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా దూరంగా ఉన్నారు.
Also Read : దువ్వాడను ఎత్తడమే లేట్.. షాక్ ఇచ్చిన జనసేన…!
అటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఎందుకు రాలేదనే విషయంపై కన్నబాబు ఆరా తీస్తున్నారు. అయితే వీరిద్దరు మాత్రం అందుబాటులోకి రాకపోవడంతో… ఆమదాలవలస, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో చింతాడ రవి, తమ్మినేని మధ్య వర్గపోరు జరుగుతోంది. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా ధర్మానకు వ్యతిరేకంగా పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవల సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపంతో ధర్మాన కూడా ఈ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సిక్కోలు వైసీపీ నేతలకు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అంటే ఏ మాత్రం లెక్క లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.