దాదాపు 5 ఏళ్ల నుంచి తిరుమలలో ఉద్యోగాలు చేసే ఇతర మతాల ఉద్యోగుల విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని హిందూ మత పెద్దలు కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇక గత ఐదేళ్లలో అన్యమతస్తులు తిరుమలలో ఎక్కువగా ఆధిపత్యం చెలాయించారు అనే ఆరోపణలు ఉన్నాయి. పాలకమండలిలో కూడా ఇతర మతాల వారికి ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణ ప్రధానంగా వినపడుతుంది.
Also Read : నిరూపిస్తే.. రూ.10 కోట్లు కానుక..!
టీటీడీ చైర్మన్ గా చేసిన వైవి సుబ్బారెడ్డి పై ఆరోపణలు ప్రధానంగా వచ్చాయి. ఇక తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో అన్యమత ఉద్యోగస్తులపై చర్యలు ప్రారంభమయ్యాయి. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సాంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం అలాగే ఎండోమెంట్ యాక్ట్ 1060 అలాగే 1989 ప్రకారం హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి… టీటీడీలో ఉద్యోగం పొంది నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ, భక్తుల మనోభావాలను అలాగే టిటిడి పవిత్రతను దెబ్బతీస్తున్న కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం.
Also Read : ఏపీలో ప్రభుత్వం మారిందా.. లేక..!
ఇతర మత కార్యక్రమాల్లో పాల్గొంటూనే టిటిడి ఉత్సవాలలో పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. 18 మంది అన్యమత ఉద్యోగస్తుల్లో ఎవరైనా తిరుమల టిటిడి అనుబంధ ఆలయాల్లో అలాగే ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు అలాగే ఊరేగింపులు, ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశాలు ఇచ్చారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానించింది.