తెలంగాణాలో ఎన్నికల హడావిడి తగ్గి కొత్త ప్రభుత్వం మొదటి విడత ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించింది. మంత్రివర్గంలో అత్యంత సీనియర్ గా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖలను స్వీకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను దాదాపు నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న తుమ్మల గారికి అధికార పార్టీలో ఉండి కూడా గత 5 సంవత్సరాలు పార్టీలో, ప్రభుత్వంలో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. అధికార పెద్దలు నిర్లక్షం చేసినా ఆయన ఎప్పుడూ తన అసంతృప్తిని బహిరింగంగా వ్యక్త పరిచింది లేదు. కొంతకాలం పాటు ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని ఎదురుచూసినా చివరకు నిరాశే మిగిలింది.
ఎన్నికల ముందు చివరి నిమషం వరకు తనకు టికెట్ వస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు. కానీ 2018 లో తనపై గెలిచి పార్టీ ఫిరాయించిన ఉపేంద్ర రెడ్డికి టికెట్ దక్కడంతో, ఆయన అసంతృప్తిని రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని ఆయనను కాంగ్రెస్ లోనికి ఆహ్వానించి, ఖమ్మం టిక్కెట్ కేటాయించారు. తుమ్మల ఈసారి కూడా పాలేరు నుంచే టికెట్ ఆశించారు, 2016 ఉప ఎన్నికలలో రికార్డ్ మెజారిటీతో గెలిచాక, పాలేరులో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేశారు, ఆర్ అండ్ బి మంత్రిగా ఖమ్మం లోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఆయన గణనీయమైన అభివృద్ధి చేశారు, రైతులకు ఉపయోగపడే సీతరామ ప్రాజెక్ట్, వంటి అనేక కార్యక్రమాలు చేశారు. 2018 లో ఆయనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి సొంత పార్టీ వారే ప్రత్యర్ధికి సహకరించి ఆయనను ఓడించారు.
కానీ ఆయన పాలేరు లో నిరంతరం అందుబాటులో ఉంటూ అక్కడి నుండే పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. 2018 లో వెన్నుపోటుతో ఓడించాక ఒక పద్ధతి ప్రకారం ఆయన ప్రాదాన్యత పార్టీలో, ప్రభుత్వంలో తగ్గిస్తూ వచ్చిన కెసిఆర్ చివరకు టికెట్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. నిజానికి తుమ్మల వంటి అంకితభావం, కష్టపడే తత్వం, నిజాయితీ, ప్రజల్లో పేరు ఉన్న నాయకుడిని వేరే పార్టీలు వదులుకునేవి కావు. కానీ ఆయన ముక్కుసూటితనం, నిర్మొహమాట వైఖరి కెసిఆర్ కుటుంబంలో తరువాతి తరం నాయకులకు ఇబ్బందిగా మారటం వల్లే ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయనే వాదనలు వున్నాయి.
తుమ్మలది రాజకీయంగా కేసిఆర్ కు సమానమైన అనుభవం, తెలుగుదేశం పార్టీలో ఆయన కెసిఆర్ కంటే పెద్ద స్థాయి నాయకుడు. ఉమ్మడి ఆంధ్రాలో ఉమ్మడి ఖమ్మంతో పాటు పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి, నల్గొండ జిల్లాలలో కూడా అనుచరులు, అభిమానులు ఉండేవారు. తెలుగుదేశం అగ్ర నాయకులలో అయన కూడా ఒకరు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలహీన పరిచే క్రమంలో కేసిఆర్ స్వయంగా ఆహ్వానించి తెచ్చుకున్న నాయకుడు తుమ్మల. అప్పటికి ఖమ్మంలో టియారెస్ దాదాపు శూన్యం. అటువంటి పరిస్థితిలో పాలేరు ఉపఎన్నికలలో సానుభూతిని అధిగమించి రికార్డ్ మెజారిటీతో గెలిచి, పార్టీని బలోపేతం చేశారు. కానీ టికెట్ ఇవ్వకుండా అడ్డులోవడమే కాక, ప్రచారంలో తన పాత సహచరుడిని తుమ్మ ముళ్లు లాంటి వ్యక్తి అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు.
అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్లో చేరినా, అక్కడి రాజకీయ పరిస్థితులు, అవసరాల దృష్ట్యా ఖమ్మం పట్టణ టికెట్ తీసుకుని, సిట్టింగ్ మంత్రి పువ్వాడ అజయ్ పైన విజయం సాధించారు. 2018 వరకు జరిగిన అన్ని ఎన్నికలలో 2016 లో తుమ్మల గారి మెజారిటీ అంతకు ముందు ఆర్ వెంకటరెడ్డి సాధించిన దానికంటే రెట్టింపు, పైగా అక్కడ తుమ్మల గారి సామాజికవర్గ ఓట్లు అధికం, తుమ్మల గారి సొంత ప్రాంతం. ఆయన చేసిన అభివృద్ధి గణనీయం. 2018లో సొంత పార్టీ వ్యక్తులు వెన్నుపోటు పొడవకుంటే అప్పుడు కూడా గెలవవలసిన వారు. ఇలా ఏవిధంగా చూసినా ఆయన గేలుపు అక్కడ లాంఛనమే. తుమ్మల గారి మద్దతు వల్లే మొదటిసారి పాలేరులో పోటీ చేసిన పొంగులేటికి అత్యధిక మెజారిటీ రావడమే నిదర్శన్సం.
అలా తుమ్మల గారి వల్ల పాలేరు, ఖమ్మం మాత్రమే కాక, ఆయన గతంలో మూడు సార్లు ప్రాతినిధ్యం వహించి, బలమైన అనుచరగణం ఉన్న సత్తుపల్లితో పాటు, తనకు గట్టి అనుచరులు ఉన్న వైరా, అశ్వరావుపేట, భద్రాచలం, కొత్తగూడెంలలో కూడా కాంగ్రెస్ కు విజయం చేకూర్చారు. బహుస బిఆర్ఎస్ తుమ్మలకు పాలేరు టికెట్ ఇచ్చి ఉంటే పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, వైరా, అశ్వరావుపేట, భద్రాచలం ఆ పార్టీ గెలిచి వుండేది. అప్పుడు కాంగ్రెస్ 58 వద్దే ఆగిపోయి బిఆర్ఎస్ 45 స్థానాలు గెలిచి ఉంటే, కడియం శ్రీహరి గారు చెప్పినట్టు బిఆర్ఎస్, ఎంఐఎం, బిజెపి కలిసి అధికారం పొందేవేమో. ఒక నమ్మకమైన, బలమైన నాయకుడిని వ్యక్తిగత అహాల కోసం దూరం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తుమ్మల గారి ఉదంతం నిరూపిస్తుంది. కెసిఆర్ ప్రచారంలో చెప్పినట్టు తుమ్మ ముళ్లు ఆయనకు, అధికార పీఠానికి మధ్య గట్టిగానే అడ్డుపడి కెసిఆర్ ను అధికారానికి దూరం చేస్తే, తుమ్మల కాంగ్రెస్ కు సహాయపడి తను మంత్రి పదవి పొందారు.