చంద్రబాబు అంటే వైసీపీ నేతలకు కోపం. చంద్రబాబు పేరు ఎత్తడానికి కూడా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే.. మరో మూడేళ్లల్లో చంద్రబాబు ఎలాగు పోతారంటూ.. ఆయన చావు కూడా కోరుకున్నారు జగన్. చంద్రబాబు పేరు చెబితేనే అగ్గి మీద గుగ్గిలం అవుతారు జగన్. కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా చాలా మంది నేతలు చంద్రబాబును నానా మాటలు అన్నారు. ఆయన వయసుపై కూడా వ్యాఖ్యలు చేశారు. వయసైపోయింది.. ముసలోడు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి వారికి తన పని తీరుతోనే చంద్రబాబు జవాబు చెప్పారు తప్ప.. ఏ కామెంట్‌ను కూడా పట్టించుకోలేదు. సీరియస్‌గా తీసుకోలేదు. చంద్రబాబుపై కక్ష సాధింపుతోనే ఆయనపై తప్పుడు కేసు పెట్టి.. ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉంచారనేది ప్రధాన ఆరోపణ. ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా కూడా అక్రమంగా జైలులో పెట్టారనేది టీడీపీ నేతల ఆరోపణ.
Also Read : భారత్ కు ట్రంప్ దెబ్బ.. టారిఫ్ లతో కొత్త షాక్..?
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో వైఎస్ జగన్ అరెస్టు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ కూడా జగన్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 3 వేల 500 కోట్ల స్కామ్ జరిగిందని.. ఇందులో వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టుతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఈ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి ప్రధాన అనుచరుడు వరుణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఓ ఫామ్ హౌస్‌లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉంటాయనే మాట వినిపిస్తోంది.
అధినేత అరెస్టు ఖాయమనే మాట బాగా ప్రచారంలో ఉండటంతో.. వైసీపీ నేతలు, అనుకూల మీడియా ఒకటే మాటను పదే పదే చెబుతున్నాయి. అదేమిటంటే.. ఐదేళ్ల వైసీపీ పాలనలో అమ్మిన లిక్కర్‌కు తమ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని.. ఆ డిస్టిలరీస్‌కు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే అనుమతులు ఇచ్చారని పెద్ద ఎత్తున వాదిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ పాలసీని రద్దు చేసి.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కొత్త లిక్కర్ పాలసీని రూపొందించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరిపితే.. అవినీతి ఎందుకు జరుగుతుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఐదేళ్లల్లో వచ్చిన వింతైన లిక్కర్ బ్రాండ్‌లకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాటికి జగన్ సర్కార్ అనుమతివ్వలేదని.. వాటికి చంద్రబాబు హయాంలోనే అనుమతులు వచ్చాయని జీవోలు కూడా చూపించారు కొందరు వైసీపీ నేతలు.
Also Read : ఫ్రీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం క్లారిటీ..!
అయితే ఇక్కడే అసలు లాజిక్‌ను వైసీపీ నేతలు మిస్సయ్యారు. చంద్రబాబు అంటేనే వైసీపీ నేతలకు గిట్టదు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలను రద్దు చేశారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టాలనే సదుద్దేశంతో అన్న క్యాంటిన్‌లను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. వాటిని జగన్ సర్కార్ మూసేసింది. చంద్రబాబు తలపెట్టిన అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజధాని అమరావతిలో ఒక్క నిర్మాణం పూర్తి అయినా సరే.. చంద్రబాబుకు పేరు వస్తుందనే భావనతో అమరావతి అనే మాటే ఎత్తలేదు. పైగా మూడు రాజధానులంటూ వింత వాదన తెర పైకి తీసుకువచ్చారు జగన్. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా సరే.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను, పనులను కొనసాగిస్తుంది. అయితే వాటిలో ఉన్న లోటు పాట్లను సరిచేస్తుంది తప్ప.. రద్దు చేయడమనేది గతంలో ఎప్పుడూ జరగలేదు.
కానీ ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు అమలవుతున్న పథకాల పేర్లు మార్చేశారు. కొన్ని పథకాలు రద్దు చేశారు కూడా. చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, విధానాలను పక్కనపడేసిన జగన్.. కొత్త పాలసీలు, కొత్త విధానాలతో ముందుకు వెళ్లారు. చంద్రబాబు అంటే.. ఏ విషయంలోనూ జగన్‌కు నచ్చలేదు. చంద్రబాబుపై నిరంతరం అసూయపడే వైసీపీ నేతలు.. ఆయన హయాంలో ఆయనకు ఇష్టమైన వారికి మాత్రమే కాంట్రాక్టులు, మద్యం తయారీ ఇచ్చారని పదే పదే చెప్పారు. అంటే.. చంద్రబాబు చేసిన మంచి నచ్చలేదు కానీ… వైసీపీ నేతల చెబుతున్నట్లుగా చంద్రబాబు చేసిన చెడు మాత్రమే నచ్చిందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : బెంగళూరులో ఆల్ ఖైదా ఉగ్రవాది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో కలిసి..!
ఐదేళ్ల వైసీపీ హయాంలో నాసి రకం మద్యం అమ్మారనేది వాస్తవం. దీని వల్ల వందల మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రపంచంలో యాడా లేని పిచ్చి పేర్లతో ఇక్కడ మద్యం అమ్మకాలు జరిపారు. పిచ్చి మందు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వాన్ని నాటి ప్రతిపక్ష నేతలు నిలదీస్తూనే ఉన్నారు. ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా.. వైసీపీ పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోలేదు. చంద్రబాబు ఇచ్చిన అనుమతులను రద్దు చేయలేదు. పైగా చంద్రబాబు ఇచ్చిన అనుమతులు.. చంద్రబాబే ఆయా డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. అసలు తయారీ యూనిట్ లేని సంస్థకు వేల కోట్ల ఆర్డర్లు ఎలా ఇచ్చారంటే మాత్రం నో ఆన్సర్. చంద్రబాబు సంస్కరణలు… చంద్రబాబు నిర్మించాలనుకున్న రాజధాని నచ్చనప్పుడు… చంద్రబాబు మద్యం మాత్రం ఎలా నచ్చింది?.. దీనికి వైసీపీ నేతలు ఏం జవాబు చెబుతారో అనేది ఇప్పుడు సగటు మందుబాబులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న. వైసీపీ ప్రభుత్వ పాలనలో పిచ్చి మందు సరఫరా చేశారనేది వాస్తవం. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో దొరికే మందు తాగలేక.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి దొంగతనంగా వచ్చిన మద్యాన్ని ఎక్కువ రేటుకు మందుబాబులు కొనుగోలు చేశారనేది వాస్తవం. మరి ఇన్ని ఆరోపణలున్నా కూడా వైసీపీ నేతలు మాత్రం.. ఇప్పటికీ చంద్రబాబు పైనే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు… ఐదేళ్ల ఆ పాలసీలను ఎందుకు రద్దు చేయలేదు..?




