ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు మళ్ళీ తప్పుడు ప్రచారం మొదలయింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా అమరావతి విషయంలో తప్పుడు ప్రచారానికి దిగడం ఆందోళన కలిగిస్తున్నది. విజయవాడ దాదాపు నాలుగు రోజుల నుంచి వరద ముంపులో ఉంది. సింగ్ నగర్, పాయకాపురం, భవానిపురం సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలను వరద నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నది. కొందరు అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడకపోయినా, ఉన్న వనరులతో ఇప్పటివరకు ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.
ఇప్పటికే వేలాది మందిని వరద ప్రాంతం నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతంలో ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా తో పాటుగా తమకు ఏ సంబంధం లేని బీఆర్ఎస్ సోషల్ మీడియా సైతం సోషల్ మీడియాలో వరద సహాయక చర్యల పై తప్పుడు ప్రచారానికి దిగింది. అమరావతి ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్ళు… విజయవాడ ఫోటోలు పోస్ట్ చేసి అమరావతి మునిగింది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
Read Also : వరద సహాయ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ దూకుడు
ఈ వరద మానవులు సృష్టించింది అంటూ మాజీ సీఎం జగన్ నిస్సిగ్గుగా తప్పుడు ప్రకటనలు ఇవ్వటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. విజయవాడ లో ముంపుకు గురైన ప్రాంతానికి, రాజధాని ప్రాంతానికి కనీసం 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సరే అసలు రాజధాని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి అనుకుందాం… చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వరదలతో మునిగిన సందర్భాలు లేవా. ప్రతీ ఏటా హైదరాబాద్ లో వరదలు రావా…? హైదరాబాద్ లో వరదలు రావడం బీఆర్ఎస్ వాళ్లకు కనపడటం లేదా అనే ప్రశ్న వినపడుతోంది.
ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టని వాళ్ళు సైతం అమరావతిలో వరదలు వచ్చాయని ప్రచారం చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే సహాయం చేయాలి గాని తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాకి, బిఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అనుబంధంగా పనిచేయడమే వారి ఆక్రోశానికి అద్దం పడుతుంది.