ఏపీలో లిక్కర్ స్కామ్‌పై జగన్ తొలిసారి నోరు విప్పారు. అయితే రామాయణమంతా చెప్పారు కానీ.. రాముడుకు సీత ఏమవుతుంది అనే ప్రశ్నకు మాత్రం తెలీదు అనుకుంటూ వెళ్లిపోయారు. తన హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని.. పైగా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చేసింది అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్.. అసలు లిక్కర్ కేసులోనే చంద్రబాబును అరెస్టు చేశారంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటి.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కదా చంద్రబాబును అరెస్టు చేసింది అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమ కేసులు బనాయించి ఏకంగా 53 రోజుల పాటు చంద్రబాబును జైలులో ఉంచింది నాటి వైసీపీ ప్రభుత్వం. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు రిలీజ్ అయ్యారు. మరి జగన్ మాత్రం 2014-19 మధ్య కాలంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారని.. బెయిల్ పై ప్రస్తుతం బయట ఉన్నారని అంటున్నారు. అంటే ప్రతిపక్ష నేత ఏ కేసులో అరెస్టు అయ్యారో కూడా నాటి ముఖ్యమంత్రికి తెలియదా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. ప్రతిపక్ష నేత అరెస్టుపై కనీస అవగాహన లేకుండానే సీఎం ఉన్నారా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
Also Read : లిక్కర్ స్కాం చైన్ లింక్ బ్రేక్ చేసిన సిట్..?
ఇక వైసీపీ అండ్ కో బ్యాచ్ తొలి నుంచి చెబుతున్న మాటే ఇప్పుడు జగన్ కూడా చెప్పుకొచ్చారు. మద్యం స్కామ్ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. మద్యం అమ్మకాలు ఎక్కువ ఉంటే లంచాలు ఇస్తారా… లేక లాభాలు తగ్గితే ఇస్తారా అని వితండ వాదం చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా పెరుగుతూ పోతే.. వైసీపీ ఐదేళ్ల పాలనలో మాత్రం మద్యం అమ్మకాలు తగ్గాయన్న జగన్… ఇందుకు తమ ప్రభుత్వం విధించిన పన్నులే ప్రధాన కారణమన్నారు. మద్యం కంపెనీలకు లాభం జరగలేదని.. అలాగే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరిగిందంటూ విచిత్రమైన లెక్కలు చెప్పారు. తమ పాలనలో మద్యం వినియోగం తగ్గిందన్న జగన్.. దీని వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడామన్నారు. మరి జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులకు బాధ్యులెవరు అనే ప్రశ్నకు నో ఆన్సర్.
Also Read : మహానాడులో చర్చించే అంశాలేమిటో తెలుసా..?
ఇక ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. ప్రతి గ్రామంలో కూడా బెల్టు షాపులు పెరిగిపోయాయన్నారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత, తెల్లవారుజామున 5 గంటలకు ముందు కూడా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. 40 వేల బెల్టు షాపులు మూసేసి, మద్యం షాపులను తగ్గిస్తే లంచాలు ఇస్తారా అంటూ జగన్ ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు నిర్వహించిందని.. కాబట్టి ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి బాటిల్ పైన క్యూ ఆర్ కోడ్ ఉంటుందని.. దానిని స్కాన్ చేసిన తర్వాతే అమ్మినట్లు చెప్పారు. దీని వల్ల ఏ బాటిల్ ఏ షాపులో అమ్మిన లెక్క కూడా తన వద్ద ఉందన్నారు. ఎక్కడా పర్మిట్ రూమ్‌లు లేవని.. బెల్ట్ షాపులు లేకుండా చూశామన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రతి షాపులో ఎమ్మార్పీ కంటే ఎక్కువగానే అమ్ముతున్నారని.. బెల్ట్ షాపులను పోలీసులే నిర్వహిస్తున్నారని.. పోలీసులే దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారని ఆరోపించారు. కింద నుంచి పై వరకు పంపకాలు జరుగుతున్నాయని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : రిషబ్ పంత్ కెప్టెన్సీ ఊస్ట్..! లక్నో యాజమాన్యం నిర్ణయం..?
ఇన్ని లెక్కలు చెప్పిన జగన్.. ఒక ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదు. ప్రభుత్వమే నిర్వహించిన మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపులు ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నకు నో ఆన్సర్.కేవలం నగదు చెల్లింపులు మాత్రమే ఎందుకు చేశారంటే నో ఆన్సర్. ప్రస్తుతం సుమో, గుడ్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పుడు చూడని బ్రాండ్లు తెస్తున్నారని వ్యాఖ్యలు చేసిన జగన్… తన హయాంలో వచ్చిన ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, బూమ్ బూమ్ వంటి బ్రాండ్‌ల గురించి అడిగితే.. సైలెంట్ అయిపోయారు.




