ఏ రాజకీయ పార్టీకి అయినా సరే కార్యకర్తలే బలం. ఏ పార్టీ నేత అయినా సరే కార్యకర్తలనే నమ్ముకుంటాడు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే నేనున్నా అంటూ భరోసా ఇస్తాడు. అలాగే ప్రచార కార్యక్రమాలు మొదలు.. తాను చేసే ఏ చిన్న పని అయినా సరే కార్యకర్తలతోనే ప్రచారం చేయిస్తారు. కానీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి కార్యకర్తలు, నేతలతో పనేంటి అన్నట్లుగా జగన్ తీరు కనిపిస్తోంది. జగన్ పేరు చెప్పగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది పాదయాత్ర, ఓదార్పు, ముద్దులు. ఇదంతా 2019కి ముందు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే జగన్ తీరు పూర్తిగా మారిపోయింది.
Also Read : రేవంత్ ను జాగ్రత్తగా తిట్టిన కేటిఆర్…!
ఓదార్పు, పాదయాత్రల్లో ప్రతి ఒక్కరితో అక్క, అన్న, చెల్లి, అవ్వా, తాత అంటూ పలకరించిన జగన్… సీఎం అయిన తర్వాత కనీసం పట్టించుకోలేదు. చివరికి సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు కాదు కదా… మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఏదైనా పని కావాలంటే… సెకండ్ గ్రేడ్ లీడర్లదే పెత్తనం. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా ఐదేళ్లు గడిచింది. జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు కూడా పరదాలతోనే జగన్ ప్రయాణించారు తప్ప… కార్యకర్తను కనీసం పలకరించలేదు. దీంతో ప్రతి ఒక్కరు ఇదేం తీరు అని విమర్శించారు.
Also Read : తిరుమలలో జగన్ కామెడీ.. మారని జగన్ తీరు
ఓడిన తర్వాత అయినా జగన్ తీరులో మార్పు వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇప్పటికి కూడా వైసీపీ బలం కేవలం సోషల్ మీడియా అని చెబుతున్నారు జగన్. నెల్లూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైసీపీకి సోషల్ మీడియానే బలమన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఫాలో అవ్వాలంటూ సూచించారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐదేళ్ల పాటు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినందుకే ఇప్పుడు అలాంటి వారంతా జైలు పాలయ్యారని గుర్తు చేస్తున్నారు. మరోసారి కూడా సోషల్ మీడియాను నమ్ముకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరిగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే… ప్రస్తుతం అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పాల్సిందే. పైగా ప్రస్తుతం ప్రభుత్వ తప్పులు ఏవి ప్రశ్నించినా సరే… వెంటనే వాటికి కౌంటర్‌గా ఐదేళ్లు జగన్ ఏం చేశాడు… ఐదేళ్లు జగన్ ఎందుకు చేయలేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో వీటికి సమాధానం చెప్పలేక వైసీపీ అభిమానులు చాలా వరకు సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయారు. మరి ఇలాంటి సమయంలో మరోసారి సోషల్ మీడియాను నమ్ముకోవడం ఏమిటని పార్టీ కార్యకర్తలు, నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.