ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అధికారులు ఇంకా ఇబ్బంది పెడుతున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరు అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కీలక శాఖల్లో పని చేసిన అధికారులు కొందరు చంద్రబాబుని, అలాగే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే కథనాలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కొందరు అధికారులపై చర్యలకు కూడా రంగం సిద్దం చేసింది సర్కార్. కొన్ని కారణాలతో అవి ముందుకు వెళ్ళడం లేదు.
అయితే వరదల సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వం పరువు తీసేందుకు సిద్దమయ్యారు. వరద సహాయక చర్యల్లో భాగంగా సరిగా పని చేయని అధికారులపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి అధికారులే కొందరు… క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కొన్ని తప్పులను వీడియోలు తీసి కొన్ని యూట్యూబ్ చానల్స్ కి స్వయంగా పంపారు. చంద్రబాబు పర్యటనకు ముందు అధికారులు ఏ విధంగా హడావుడి చేసారు, పర్యటన అయిన తర్వాత సహాయక కార్యక్రమాలను కావాలనే ఎలా లైట్ తీసుకున్నారు అనే వాటిని వీడియోలు తీసారు.
Read Also : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పయ్యావుల అత్యవసర భేటీ
అలాగే ఇందిరా గాంధీ స్టేడియంలో ఆహరం చేర్చే సమయంలో కూడా కావాలనే తప్పులు చేయించి వాటిని వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలను కూడా యూట్యూబ్ చానల్స్ కి పంపించారు. అలాగే కులం పేరుతో ఇబ్బంది పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు కొందరు. కమ్మ కులాన్ని టార్గెట్ చేసేందుకు క్షేత్ర స్థాయిలో జరిగే పనులపై యూట్యూబ్ చానల్స్ కి తప్పుడు సమాచారాన్ని చేరవేశారు. వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీలో కొన్ని ప్రాంతాలకు సరిగా నీళ్ళు వెళ్ళకుండా అడ్డుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
జక్కంపూడిలో చాలా మందికి మంచి నీరు కూడా అందలేదు. ఇది కావాలనే చేసారని అలాగే కొన్ని మరణాలకు కూడా అధికారులు పరోక్షంగా కారణం అయ్యారని సమాచారం. మరి ఇలాంటి వారిని గుర్తించి వారి పై చర్యలు తీసుకుంటారా లేక మిగతా కేసుల్లానే వీరిని కూడా లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఇప్పటికే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారుల పై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ కేసుల పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. కొన్ని తీవ్రమైన కేసుల్లో కూడా పోలీసులు సెక్షన్ 141 కింద నోటీసులు ఇచ్చి పంపిస్తుండటం ప్రజలకి, టిడిపి కేడర్ కి తీవ్ర అసంతృప్తిగా ఉంది.




