దేశంలో ఓటర్ల చోరీ అంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న సమయంలో.. బీహార్ లో ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై వివాదం నడుస్తోంది. ఇక్కడ ఓటర్ల తోలన్గింపు మాత్రమే కాదు పౌరసత్వ సమస్య కూడా తలనొప్పిగా మారింది. పౌరసత్వ రుజువును అడిగే అధికారం తమకు ఉందని భారత ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన తర్వాత సమస్య మరింత ఇబ్బందిగా మారింది. మొదట్లో, ఆధార్, ఓటరు గుర్తింపు, రేషన్ కార్డులను చెల్లుబాటు అయ్యే పత్రాలుగా పరిగణించాలనే సూచనను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
Also Read : అరుణ ఫోన్ లో ఐపిఎస్, మాజీ మంత్రి వీడియోలు..?
ఆ తర్వాత సుప్రీం కోర్ట్ సూచనలతో ఆధార్ కార్డును ప్రూఫ్ గా అంగీకరించేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో అసలు మన దేశంలో పౌరసత్వం యొక్క నిబంధనలు ఏంటీ, దేశ పౌరులు అంటే ఎవరు.. అనేది కీలకంగా మారింది. వాస్తవానికి జనవరి 26, 1950న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం పౌరసత్వాన్ని నిర్వచించలేదు. ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు పార్ట్ 2, పౌరసత్వానికి అర్హులైన వ్యక్తులకు సంబంధించి పలు వివరాలను ఇచ్చింది. అనేకసార్లు సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం, 1955లో భారత పౌరసత్వాన్ని పొందడం, నిర్ణయించడానికి షరతులను ప్రస్తావించింది.
భారత పౌరసత్వం పొందడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి: జననం, వంశపారంపర్యత, రిజిస్ట్రేషన్, సహజంగా పౌరసత్వం. జనవరి 26, 1950 మరియు జూలై 1, 1987 మధ్య దేశంలో జన్మించిన వారందరూ, వారి తల్లిదండ్రుల జాతీయతతో సంబంధం లేకుండా భారతదేశ పౌరులే. జూలై 1, 1987 తర్వాత, డిసెంబర్ 2, 2004 ముందు భారతదేశంలో జన్మించిన వారందరూ, వారి తల్లిదండ్రులలో ఎవరైనా వారు పుట్టిన సమయంలో భారతీయ పౌరులుగా ఉంటే వారు భారతీయ పౌరులు అవుతారు.
డిసెంబర్ 2, 2004 తర్వాత దేశంలో జన్మించిన వారందరూ, వారి తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులైతే లేదా కనీసం వారిలో ఒకరు భారతీయులై, మరొకరు అక్రమ వలసదారు కాకపోతే వారు భారత పౌరులు అవుతారు. ఒక వ్యక్తి జనవరి 26, 1950న లేదా ఆ తర్వాత దేశం వెలుపల జన్మించి ఉంటే, అతని తండ్రి పుట్టుకతో భారతీయ పౌరుడు అయితే ఆ వ్యక్తి సంతతి ప్రకారం దేశ పౌరుడు అవుతాడు. ఒక వ్యక్తి డిసెంబర్ 2, 1992న లేదా ఆ తర్వాత భారతదేశం వెలుపల జన్మించి, డిసెంబర్ 3, 2004కి ముందు, అతని తల్లిదండ్రులలో ఎవరైనా పుట్టుకతో భారతీయ పౌరులైతే, ఆ వ్యక్తి వంశపారంపర్యంగా భారతదేశ పౌరుడు అవుతాడు.
Also Read : సహారా టూ డ్రీం 11.. టీం ఇండియా స్పాన్సర్లను వెంటాడుతున్న కష్టాలు
డిసెంబర్ 3, 2004న లేదా ఆ తర్వాత భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి, అతని తల్లిదండ్రులు అతనికి ఏ దేశ పాస్ పోర్ట్ లేదని, మరియు అతని జననం పుట్టిన ఒక సంవత్సరం లోపు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్నామని అఫిడవిట్ ఇస్తే భారత పౌరుడు అవుతాడు. అలాగే ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకునే ముందు 12 సంవత్సరాలు దేశంలో నివసిస్తున్నట్లయితే అలాగే పౌరసత్వ చట్టం మూడవ షెడ్యూల్ కింద అర్హతలు కలిగి ఉంటే, సహజీకరణ ప్రక్రియ ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని పొందవచ్చు. 2019 పౌరసత్వ సవరణ చట్టం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి డిసెంబర్ 31, 2014 కి ముందు దేశంలోకి ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు భారత్ లో నివసించేందుకు వీలు కల్పించారు. ముస్లింలను మినహాయించడం వివాదాస్పదంగా మారింది.