ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని ఆలోచిస్తోందో మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం.. తమ విధానం ఇదే అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పేశారు. ఏపీలో రాజధాని అమరావతి విషయంలో జగన్ తమ మనసులో మాటను స్పష్టం చేసేశారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో కూడా వైసీపీ వ్యవహరించే తీరు ఇదే అని మరోసారి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఓ వైపు రాష్ట్ర రాజధాని అమరావతి పునఃనిర్మాణ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. తమ విధానం మాత్రం ఇదే అంటూ జగన్ చెప్పకుండానే చెప్పేశారు. ఏపీ రాజధానిగా అమరావతిని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వస్తే.. వైసీపీ విధానం మూడు రాజధానులే అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
Also Read : సజ్జల.. సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూస..!
ఏపీ రాజధాని అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ వేడుకను ఒక పండుగలా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి ప్రధాని కేవలం రాజధాని నిర్మాణం గురించే ఏపీకి రావడం లేదు. ఏకంగా రూ.55 వేల కోట్ల విలువైన పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు కూడా ప్రధాని చేయనున్నారు. మెగా ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్ల పనులకు భూమి పూజ, అమరావతి బైపాస్ రోడ్డుతో పాటు మంగళగిరి నుంచి గొల్లపూడి, నున్న మీదుగా నేరుగా చిన్న అవుటపల్లి వరకు వెళ్లేలా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారి కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఇన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
Also Read : మళ్లీ కుంటి సాకులు చెబుతున్న జగన్..!
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ కొత్త రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం 33 వేల ఎకరాలను సేకరించారు కూడా. దీనికి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలోనే అంగీకారం తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చేశారు. అమరావతిలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపించారు. అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్.. ఎక్కడా లేని విధంగా 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. పరిపాలన, శాసన, న్యాయ రాజధానులుగా విశాఖ, అమరావతి, కర్నూలును ప్రకటించారు.
Also Read : లోకేష్ ట్వీట్‌తో టీడీపీ కార్యకర్తలు హర్ట్ అయ్యారా..?
శాసన రాజధానిగా ప్రకటించారు తప్ప.. అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా వేయలేదు. న్యాయ రాజధాని అని కర్నూలును ప్రకటించినప్పటికీ.. న్యాయ పరమైన చిక్కుల వల్ల చివరికి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదు. అదే సమయంలో విశాఖలో మాత్రం.. సీఎం క్యాంపు కార్యాలయం కోసం అన్నట్లుగా పర్యాటక శాఖ నిధులతో రాజభవనం నిర్మించారు. అలాగే సచివాలయం నిర్మించేందుకు కూడా దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థలం కూడా ఎంపిక చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమితో వైసీపీ సైలెంట్ అయ్యింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణం ప్రారంభిస్తామని.. 2027 జూన్ నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే పనులు ప్రారంభమయ్యాయి. కానీ వైసీపీ మాత్రం అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు సిద్ధంగా లేనట్లుగా ఉంది. అందుకే పునఃశంకుస్థాపన వేడుకకు వైసీపీ దూరంగా ఉంది.