కరేడు రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కరేడులో ఇండోసోల్ పరిశ్రమకు భూములు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. తమకు న్యాయం చేయాలని జగన్‌ను కోరారు. అంతవరకు అంతా బాగుంది. ఆ తర్వాత నుంచే అనుమానాలు మొదలయ్యాయి. కరేడు ప్రాంత రైతులకు జగన్ ఇచ్చిన హామీలు ఏమిటీ.. అసలు కరేడు రైతులతో జగన్ ఏ మాట్లాడారు.. వాళ్లకు జగన్ ఇచ్చిన భరోసా ఏమిటి.. కరేడు వివాదంలో వైసీపీ స్టాండ్ ఏమిటి.. అనే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా కరేడులో 8వేల పైచిలుకు భూములను ఇండోసోల్ పరిశ్రమకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓ వైపు సముద్రం, మరో వైపు పచ్చని పంటపొలాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడి పండే భూములను ఇండోసోల్ పరిశ్రమకు కేటాయించడాన్ని ఆ ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూ సేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని కరేడు రైతులు తెగేసి చెప్పేశారు. ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప.. భూములు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
Also Read : వర్షా కాలానికి జీర్ణ వ్యవస్థకు సంబంధం ఏంటీ..?
ఇండోసోల్ సంస్థకు భూములు కేటాయించింది జగన్ సర్కార్. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇండోసోల్ సంస్థ జగన్ బినామీ విశ్వేశ్వరరెడ్డిదని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కూడా విమర్శించారు. లక్ష రూపాయల క్యాపిటల్ పెట్టుబడితో లక్షల కోట్ల లావాదేవీలు ఎలా చేస్తారని అప్పట్లో లోకేష్ ప్రశ్నించారు కూడా. సోలార్ ప్యానల్ తయారీ సంస్థకు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు కేటాయించాలనే ప్రశ్న తలెత్తింది. అదే సమయంలో కరేడులో భూములు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని కూడా ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు వాన్‌పీక్ పేరుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విలువైన భూములను కేటాయించారు. నాటి నుంచి ఆ భూములు ఖాళీగానే ఉన్నాయి తప్ప.. పరిశ్రమ వచ్చింది లేదు. కరేడు భూముల పరిస్థితి కూడా అంతే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరేడులో ఇండోసోల్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అయినా సరే.. జగన్ సర్కార్ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. ఇక ఇండోసోల్ సంస్థ కూడా హడావుడిగా ఓ చిన్న షెడ్ వేసి.. ఉత్పత్తి ప్రారంభించినట్లు లెక్కలు చూపిస్తోంది.
అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండోసోల్ సంస్థ కోసం భూసేకరణ చేయాలని నోటిఫికేషన్ విడుదలైంది. దీనిని ఆ ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. భూములు ఇచ్చేది లేదన్నారు. దీంతో ప్రభుత్వం కూడా సైలెంట్ అయ్యింది తప్ప.. బలవంతపు భూసేకరణకు ప్రయత్నించలేదు. కానీ ఇదే సమయంలో వైసీపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతోంది. కరేడులో నిర్వహించిన గ్రామ సభను రైతులు బహిష్కరిస్తే.. అన్ని పత్రికలు ఫ్రంట్ పేజీలో వార్త ప్రచురిస్తే.. వైసీపీ అధికారిక పత్రిక సాక్షిలో మాత్రం నెల్లూరు జిల్లా ఎడిషన్‌లో లోపల పేజీలో వార్త వచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకు మాత్రం.. పరిశ్రమలను చంద్రబాబు ప్రభుత్వం తరిమేస్తోంది అంటూ సాక్షిలోనే మొదటి పేజీలో వార్త రాశారు. భూ కేటాయింపులు చేయకుండా ఇండోసోల్ సంస్థను వేధిస్తున్నారని.. ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత భూములు ఇవ్వకపోతే.. వేలాది మందికి ఉపాధి లేకుండా పోతుందని గగ్గొలు పెట్టింది సాక్షి. ఇండోసోల్ సంస్థకు భూములు ఇవ్వాలని సాక్షి పత్రిక పరోక్షంగా వార్తలు రాస్తోంది.
Also Read : భారత్ లో అడుగు పెడుతున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇదే సమయంలో కరేడు ప్రాంత రైతులను మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌లోని జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. తాడేపల్లిలో జగన్‌ను కలిసి కరేడు రైతులు.. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల తరఫున పోరాటం చేసిన జగన్.. ఇప్పుడు కరేడు రైతుల పట్ల కూడా పోరాటం చేయాలని కోరారు. దీంతో రైతులకు ఏం చెప్పాలో జగన్ అర్థం కాలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వమే భూములు కేటాయించిన విషయాన్ని రైతులు ప్రస్తావిస్తే.. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూకేటాయింపు చేశామన్నారు. అంతే తప్ప.. భూకేటాయింపులు రద్దు చేయాలని మాత్రం చెప్పలేదు. కరేడు రైతుల పోరాటానికి సంఘీభావం తెలియజేయాలని.. కరేడులో పర్యటించాలని రైతులు కోరారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించినట్లు లేదంటున్నారు సొంత పార్టీ నేతలు. కరేడులో రైతులకు సంఘీభావం తెలియజేస్తే.. ఇండోసోల్ సంస్థకు భూ కేటాయింపులు రద్దు చేయాలని కోరాలి. అంటే పరిశ్రమలు వద్దు అని పరోక్షంగా చెప్పినట్లు అవుతుంది కదా.. అనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. దీంతో కరేడు రైతుల విషయంలో జగన్ స్టాండ్ ఏమిటో అర్థం కావటం లేదని.. జగన్‌కు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదని వైసీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు.