ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న ప్రమాదకర ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలడం సంచలనం రేపుతోంది. వీరు కేవలం స్థానికంగానే కాకుండా, దేశవ్యాప్తంగా ఒక నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మరియు డానిష్ అనే ముగ్గురు యువకులు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
Also Read : మతం మారితే రిజర్వేషన్ రద్దు..!
ఈ గ్రూపులో ఉగ్రవాద సంస్థ ఐసిస్ కి సంబంధించిన వీడియోలు, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఇతర రాష్ట్రాల్లోని ఉగ్రవాద సానుభూతిపరులను ఏకం చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లించడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. విజయవాడలో బయటపడిన ఈ ముఠా వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని అనుమానిస్తున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ముగ్గురితో టచ్‌లో ఉన్న ఇతర వ్యక్తుల కోసం ఢిల్లీ, రాజస్థాన్, బిహార్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
Also Read : కామెడి పీస్ అయిపోతున్న ట్రంప్.. ఇవేం మూడ్ స్వింగ్స్ ప్రెసిడెంట్ సాబ్..?
ముఖ్యంగా హైదరాబాద్ లోని కొందరు యువకులతో వీరు నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పట్టుబడిన యువకుల మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తెలిశాయి. వీరు పాకిస్థాన్ కు చెందిన హ్యాండ్లర్లతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. విదేశీ గడ్డపై ఉన్న ఉగ్రవాద నేతల ఆదేశాల మేరకు వీరు ఇక్కడ స్లీపర్ సెల్స్ లా పని చేస్తున్నారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. విజయవాడ వంటి ప్రసిద్ధ నగరంలో ఉగ్రవాద సానుభూతిపరులు పట్టుబడటంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ప్లేసులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్ట్ అయిన ముగ్గురిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

