జైలర్ హంసపాల్‌పై బదిలీ వేటు.. అసలు ఎవరీ హంసపాల్.. ఒక జైలర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎందుకింత కంగారు. ఈ హంసపాల్ విషయంలో ఎందుకు కొందరు రాజకీయ నేతలు హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అన్న తర్వాత బదిలీ వేటు పడటం సర్వ సాధారణం. ఈ రోజు ఇక్కడ.. రేపు ఇంకో చోట. జిల్లా కలెక్టర్లు అయితే.. నెల రోజులకే బదిలీ అయిన వారు కూడా ఉన్నారు. పోలీసుల సంగతి చెప్పాల్సిన పని లేదు. టీచర్లు, ఉన్నతాధికారులు, రెవెన్యు ఉద్యోగులు.. ఇలా అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులు బదిలీ అవుతూనే ఉంటారు. కొందరు మూడేళ్లకు అవుతారు.. మరికొందరు మూడు రోజులకే మారిపోతారు. కానీ హంసపాల్ విషయం మాత్రం అలా కాదు. ఈ ట్రాన్స్‌ఫర్ ఇప్పుడు ఓ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Also Read : పోలవరంపై తొలిసారి రంగంలోకి మోడీ
ఇంతకీ ఎవరీ హంసపాల్ అంటే.. దీనికి ఒకటే జవాబు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హంసపాల్ వీర విధేయుడు. జగన్ చెప్పింది చేయడం ఆయన ఏకైక కర్తవ్యం. అది మంచి, చెడు, రూల్స్ పరిధిలో ఉన్న విషయమా.. లేక రూల్స్ అతిక్రమిస్తున్నారా అనేది కూడా గుర్తించేది లేదు. జగన్ చెప్పారు.. నేను ఆచరిస్తున్నాను.. అనేది హంసపాల్ మాట. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడో లూప్‌లో ఉన్న హంసపాల్‌ను విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు జగన్. ఐదేళ్లు ఆయనే జైలు బాధ్యతలు చూసుకున్నారు. హంసపాల్ జైలు సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన సమయంలో టీడీపీలో కొందరు ముఖ్యనేతలను వైసీపీ సర్కార్ అరెస్టు చేసి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉంచింది. ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు నేతలను కూడా జిల్లా జైలులోనే ఉంచారు. వీరంతా ఏం చేస్తున్నారనేది హంసపాల్ ప్రతిరోజు తాడేపల్లి ప్యాలెస్‌కు అప్ డేట్ చేశారు. మాజీ మంత్రి హోదాలో జైలులో కొన్ని సౌకర్యాలు కోరితే వాటిని హంసపాల్ తోసిపుచ్చారు. చివరికి ప్రతిరోజు న్యూస్ పేపర్ ఇచ్చేందుకు కూడా హంసపాల్ అనుమతించలేదు.
Also Read : బాబోయ్ జగన్.. ఇదేం లాజిక్కు..!
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హంసపాల్‌పై వేటు పడుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ జైలు వైసీపీ నేతలు, అభిమానులతో నిండిపోయింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, మద్యం కుంభకోణం టీమ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పీఏ దిలీప్, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా విజయవాడ జైలులోనే రిమాంజ్ ఖైదీలుగా ఉన్నారు. తొలి నుంచి వైసీపీ వీరాభిమానిగా గుర్తింపున్న హంసపాల్ తన స్వామి భక్తిని చాటుకున్నాడు. జైలులో ప్రతి చిన్న విషయం కూడా నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం సైలెంట్‌గా హంసపాల్‌పై బదిలీ వేటు వేసింది. వాస్తవానికి హంసపాల్‌పై సొంత శాఖ అధికారులే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి కేంద్ర కారాగారం, జిల్లా కారాగారంలో సూపరింటెండెంట్ చాంబర్ వరకు మీడియాకు అనుమతి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం హంసపాల్ పూర్తిగా భిన్నం. మీడియా ప్రతినిధులే కాదు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఆయనను కలవడానికి సెంట్రీ సిబ్బంది నుంచి సమాచారం పంపినా స్పందించరు. కొద్దిరోజులుగా హంసపాల్ ప్రవర్తనపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. దీంతో ఆయనపై వేటు పడింది.