అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయిన వైసీపీ నేతల బెండు తీస్తున్నారు ఏపీ పోలీసులు. మాచర్ల మునిసిపల్ మాజీ ఛైర్మన్ తురగా కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పరారీలో ఉన్న కిషోర్‌ను తెలంగాణలో అరెస్ట్ చేశారు. మాచర్ల మునిసిపల్ మాజీ ఛైర్మన్ తురగా కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020లో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై మాచర్లలో తురగా కిషోర్ దాడి చేసి హత్య చేసేందుకు యత్నించాడు. ఈ దాడిలో బుద్దా వెంకన్నతో పాటు న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తురగా కిషోర్ పరారీలో ఉన్నాడు. హైదరాబాద్‌లో దాక్కున్న తురగా కిషోర్‌ను విజయపురి సౌత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: చంద్రబాబు వ్యాఖ్యలపై కేడర్ అసంతృప్తి..!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తురగా కిషోర్ ప్రధాన అనుచరుడు. అమరావతిలో పిన్నెల్లిని రైతులు అడ్డుకున్నారంటూ మాచర్లలో ధర్నాలు నిర్వహించాడు. మాచర్లలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డాడు. చివరికి మునిసిపల్ ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున ఎవరైనా నామినేషన్ వేసినా సరే… మీ అంతు చూస్తా అంటూ కత్తి పట్టి మాచర్లలో బహిరంగంగానే బెదిరించాడు తురగా కిషోర్. దీంతో మాచర్ల మునిసిపాలిటీలోని అన్ని వార్డులు కూడా వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. స్వామి భక్తి ప్రదర్శించిన తురగా కిషోర్‌ను మొదటి రెండున్నరేళ్ల పాటు మునిసిపల్ ఛైర్మన్‌ను చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
Also Read: మాకేం తెలియదంటున్న మంత్రులు… నిజమెంతా..?
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తురగా కిషోర్ అక్రమాలకు అంతు లేకుండా పోయిందని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. చివరికి రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటూ నాటి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. మాచర్లలో వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే.. వారిపై తురగా కిషోర్ అనుచరులు దాడులకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఇక 2024 ఎన్నికల సమయంలో కూడా కత్తి పట్టుకుని ఎవరోస్తారో రండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎన్నికల ఫలితాల అనంతరం తురగా కిషోర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు దాదాపు 7 నెలలుగా గాలిస్తున్నారు. చివరికి హైదరాబాద్‌లో తలదాచుకున్న తురగా కిషోర్‌ను విజయపురి సౌత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తురగా కిషోర్ అరెస్ట్‌తో మాచర్లలో వైసీపీ బాధితులు సంబరాలు జరుపుకుంటున్నారు.